హైదరాబాద్​ను గ్లోబల్ సిటీ చేస్తం

  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మలక్ పేట, వెలుగు : హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శనివారం మలక్ పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్ యార్డులో నిర్వహించిన హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయనతోపాటు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అతిథులుగా పాల్గొన్నారు. మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ గా చెకోలేకర్ లక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ గా కోట శ్రీనివాస్, డైరెక్టర్లుగా శివాజీ, రామారావు, రాజేందర్ రెడ్డి, షకీల్, ప్రత్యూష, సత్యనారాయణ, సాయిరాం, సుల్తానా, అశోక్, కిషన్ సింగ్, జగదీశ్, కృష్ణతో మార్కెట్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా కొహెడలోని 158 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని తెలిపారు. రైతులు, ట్రేడర్లు, హమాలీలు, కార్మికులు సిద్ధమైతే తరలింపు జరుగుతుందన్నారు.