అనంతగిరిలో గ్లాంపింగ్! 18 ఎకరాల్లో 89 టెంటెడ్ హౌస్​ల నిర్మాణానికి ఏర్పాట్లు

అనంతగిరిలో గ్లాంపింగ్!
18 ఎకరాల్లో 89  టెంటెడ్ హౌస్​ల నిర్మాణానికి ఏర్పాట్లు
రాష్ట్ర చరిత్రలో వికారాబాద్ జిల్లాలోనే తొలిసారి..  
రూ.4.45 కోట్ల అంచనా వ్యయంతో పనులు 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం
టెండర్లు ఆహ్వానించేందుకు టూరిజం శాఖ కసరత్తు

హైదరాబాద్, వెలుగు:  అనంతగిరి అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.  పర్యాటకులు ప్రకృతిలో సేద తీరేలా సకల సౌకర్యాలతో  ‘గ్లాంపింగ్ ’ (టెంటెడ్ హౌస్​లు) ఏర్పాటు చేయబోతున్నది.  అందంగా, ఆకర్షణీయంగా,  అన్ని సదుపాయాలు ఉండేలా వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇక  టూరిస్టులు అనంతగిరి పర్యాటక ప్రాంతాలు తిలకించేందుకు వెళ్లినప్పుడు హోటళ్లు, రిసార్ట్ లలో బస చేయాల్సిన పని లేకుండా ఈ  టెంటె డ్​ హౌస్​​లలో ఉండొచ్చు.  ఈ మోడల్ పర్యావరణ అనుకూలమైనదని టూరిజం అధికారులు చెబుతున్నారు.  వికారాబాద్ జిల్లా అనంతగిరిలో దాదాపు 18 ఎకరాల్లో ‘గ్లాంపింగ్’   ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.  ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబంధించి ప్రాసెస్ కూడా మొదలైనట్టు సమాచారం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. 

18 ఎకరాల్లో 89 గుడారాలు 

మినీ ఊటీ, తెలంగాణ ఊటీగా పిలుస్తున్న అనంతగిరికి రోజురోజుకూ పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. రాష్ట్ర రాజధానికి  కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.  ఈ ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా అనుకూలంగా ఉండడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉన్నది.  అయితే, ఇక్కడ బస చేసేందుకు టూరిజం శాఖ ఇప్పటికే  రెండు సూట్స్​, 32 గదులను ఏర్పాటు చేసింది.  వీటికి తోడు మరింత సౌకర్యవంతంగా గ్లాంపింగ్ ను ఏర్పాటు చేయబోతున్నది.  రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వికారాబాద్ జిల్లాలో 18 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో దాదాపుగా రూ. 4.45 కోట్ల అంచనా వ్యవయంతో  ‘గ్లాంపింగ్’  ఏర్పాటు చేయబోతున్నారు.  ఒక్కొక్క టెంటెడ్ హౌస్​ను  రూ.4  లక్షల నుంచి రూ.5 లక్షల వ్యయంతో  నిర్మించనున్నారు.  ఇందులో అన్ని వసతి  సదుపాయాలు కల్పించనున్నారు. ఇండ్లలో ఉండే సదుపాయాలు ఈ టెంటెడ్ హౌస్​లో ఉండనున్నాయి. బెడ్ రూం, అటాచ్డ్​ బాత్​రూం, కిచెన్​ ఉండేలా వీటి నమూనాలు తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే టూరిజం శాఖ వీటికి సంబంధించి కొన్ని నమూనాలను పరిశీలించనట్టు సమాచారం. నాలుగైదు లక్షల బడ్జెట్​లో పూర్తయ్యే నమూనాలను ఎంపిక చేసినట్టు తెలిసింది.  ఇవి అందుబాటులోకి వస్తే అనంతగిరికి మరింత పర్యాటక శోభ సంతరించుకోనున్నది. పర్యాటకుల సంఖ్య పెరగడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.   
 
పక్కా ప్రణాళికతో ముందుకు.. 

పర్యాటకులకు వసతులు కల్పించడంతోపాటు  పర్యాటకాన్ని  ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది.  ఇందులో భాగంగా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీని రూపొందించగా.. అసెంబ్లీలో ఆమోద ముద్ర కూడా పడింది.  దేశంలోనే రాష్ట్రాన్ని ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దడంతోపాటు పర్యాటక రంగంలో  రూ.15 వేల కోట్ల  పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ పర్యాటక విధానాన్ని  ప్రవేశపెట్టింది.  2025 నుంచి 2030  వరకు ఐదేండ్ల పాటు అమలయ్యేలా టూరిజం శాఖ దీన్ని  రూపొందించింది.  దీంతో రాష్ట్రంలో పర్యాటక రంగం పరుగులు పెట్టనున్నది.  బడా కంపెనీలు టూరిజం ప్రదేశాల్లో  పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఏర్పడనున్నది. 

ప్రకృతి సోయగం.. అనంతగిరి సొంతం 

అనంతగిరి  పర్యాటక అందాలకు నెలవుగా మారింది.  కొండల్లో ట్రెక్కింగ్‌‌‌‌చేస్తే ఆ అనుభూతే వేరు.  ప్రకృతి ఒడిలో సేద తీరినట్టు ఉంటుంది. వికారాబాద్‌‌‌‌కు 10 కిలోమీటర్లు, నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ కొండలు ఉన్నాయి. గుహలు, కోటలు, ఆలయాలు ఈ ప్రాంత ఔన్నత్యాన్ని చాటుతాయి.  అడవి అందాల మధ్య 1,300 ఏండ్ల చరిత్ర గల అనంత పద్మనాభస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను పంచుతున్నది. మూసీ జన్మ స్థానాన్ని ఇక్కడి అడవుల్లో చూడొచ్చు. అంతేకాకుండా, పచ్చని పంట పొలాలతో కోటిపల్లి రిజర్వాయర్‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం స్వాగత పలుకుతుంది.  అనంతగిరి పర్యాటక వసతి నుంచి 20 కిలోమీటర్లు వెళ్తే కోటిపల్లి చెరువు అందాలను వీక్షించొచ్చు.  వికారాబాద్‌‌‌‌ నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే దామగుండం వస్తుంది. ఈ పది కిలోమీటర్ల దారిలో ఎత్తు పల్లాలతో కొండ ప్రాంతంలో విహారం పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఇక్కడి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. కొలను మధ్యలో నిర్మించిన చిన్న కోవెల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఇక్కడ అటవీ ప్రాంతంలో నేవీ రాడర్​ స్టేషన్ కూడా ఏర్పాటు కాబోతున్నది.