రోడ్డు విస్తరణ.. జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్

 రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి,  నటుడు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ  ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు.  హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని తెలంగాణ  ప్రభుత్వం నిర్ణయించింది.ఈ క్రమంలో రోడ్ల డివైనింగ్ లో భాగంగా బంజారాహిల్స్ లో రోడ్ నంబర్ 12 లోని  జానారెడ్డి ఇంటి కాంపౌండ్,  జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. బాలకృష్ణ ఇంటికి సుమారు ఆరు ఫీట్ల వరకు మార్కింగ్ వేశారు సిబ్బంది.  అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
  
6 జంక్షన్లలో 6 అండర్​ పాస్​లు 

కేబీఆర్​పార్క్​చుట్టూ మొత్తం ఆరు జంక్షన్లలో ఆరు అండర్ పాస్ లు రానున్నాయి. అలాగే ఒక పక్క నుంచి మరో పక్కకు ట్రాఫిక్ సమస్య లేకుండా 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. 2026 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న పాలకమండలి గడువు అదే నెల 10న ముగియనుంది. ఈ లోపు పార్కు చుట్టూ కొన్నిచోట్ల అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రేటర్​లో ఒకేచోట భారీగా పనులు మొదలు పెట్టడం ఇదే మొదటిది. కేబీఆర్​పార్క్​చుట్టూ జూబ్లీ చెక్ పోస్టు, రోడ్ నెంబర్45, ఫిలింనగర్, మహారాజ్​అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్​ఎంట్రన్స్ జంక్షన్లు ఉన్నాయి. ఇందులో జూబ్లీ చెక్​పోస్ట్​జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ల వద్ద రెండు చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగిలిన నాలుగు జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 

జూబ్లీ చెక్​పోస్ట్​వద్ద ఒకదానిపై మరో ఫ్లైఓవర్ రానున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లనుంది. వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అండర్​పాస్​లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ని ఆశ్రయించారు. ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే వాటిని వేరేచోట ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. 

రోడ్ల వైడెనింగ్ కోసం 87 ఆస్తులను సేకరిస్తున్నారు. ఇందులో మాజీమంత్రి జానారెడ్డితోపాటు సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలో ఓ దఫా మార్కింగ్ జరిగింది. టెండర్లు పూర్తికాగానే పనులు షురూ అవుతాయి. కేబీఆర్ పార్కుతో పాటు రోడ్ నంబర్​12ను విస్తరించనున్నారు. 100 అడుగుల మేర ఉన్న రోడ్డును 120 అడుగులకు పెంచనున్నారు. బాలాజీ టెంపుల్ జంక్షన్ తోపాటు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.150 కోట్లను కేటాయించింది. ఈ పనులను కూడా వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.