వెళ్లిపొండి.. లేదంటే పంపేస్తం: రైతులకు కలెక్టర్ అల్టిమేటం

వెళ్లిపొండి.. లేదంటే  పంపేస్తం: రైతులకు కలెక్టర్ అల్టిమేటం
  • రైతులకు ఘజియాబాద్ కలెక్టర్ అల్టిమేటం
  • వెంటనే రోడ్లు ఖాళీ చేయాలని నోటీసులు
  • ఘాజీపూర్ బార్డర్​లో టెన్షన్.. టెన్షన్..
  • భారీగా పారామిలటరీ బలగాల  మోహరింపు
  • తాము సరెండర్ కాబోమన్న బీకేయూ నేత రాకేశ్ తికాయత్
  • ఉద్యమం నుంచి తప్పుకున్న 4 సంఘాలు

నిరసనలు ఆపి రాత్రి కల్లా బార్డర్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని యూపీ సర్కారు ఆర్డర్ ఒకవైపు.. ఏం చేసినా వెళ్లేది లేదని కొన్ని రైతు సంఘాలు మరోవైపు.. దీంతో ఢిల్లీ, యూపీ బార్డర్ లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. గురువారం ఘాజీపూర్ బార్డర్​లోని రైతుల ఆందోళన శిబిరాల వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన ఘజియాబాద్ కలెక్టర్ రైతులకు అల్టిమేటం జారీ చేశారు. రాత్రి కల్లా బార్డర్​ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. లేదంటే తామే అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేస్తామని హెచ్చరించారు. అయితే తాము సరెండర్ కాబోమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. సర్కారు అణచివేతకు ప్రయత్నిస్తే సూసైడ్ చేసుకుంటానన్నారు. ఘాజీపూర్​లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. సింఘు, టిక్రీ బార్డర్ల నుంచి కూడా చాలామంది రైతులు ఇంటిదారి పడుతున్నారు.

న్యూఢిల్లీ:

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ బార్డర్​లోని ఘాజీపూర్​లో నిరసనలు ఆపేయాలని రైతులకు ఘజియాబాద్ కలెక్టర్ అల్టిమేటం జారీ చేశారు. రాత్రి కల్లా బార్డర్​ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. లేదంటే తామే అక్కడి నుంచి పంపించి వేస్తామన్నారు. అయితే తాము సరెండర్ కాబోమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. దీంతో ఘాజీపూర్ బార్డర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ వందలాది మంది రైతులు ఉండగా.. భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించినట్లు ఆఫీసర్లు చెప్పారు.

మేమే పంపేస్తం

గురువారం సాయంత్రానికి జిల్లా అధికారులు, పోలీసు ఆఫీసర్లు ఘాజీపూర్ బార్డర్ ప్రాంతానికి చేరుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని భారీగా మోహరించారు. రాత్రి లోపు యూపీ గేట్ నుంచి వెళ్లిపోకపోతే.. తామే అక్కడి నుంచి పంపేస్తామని రైతులకు జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే స్పష్టం చేశారు. తమ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనలన్నింటినీ ఆపేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు యూపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఘజియాబాద్ యంత్రాంగం రైతులకు అల్టిమేటం జారీ చేసింది.

ఢిల్లీ బార్డర్లలో భారీ భద్రత

రిపబ్లిక్ డే ఘటనల నేపథ్యంలో ఢిల్లీ బార్డర్లలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా బలగాలను మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో కూడా సెక్యూరిటీ సిబ్బందిని మోహరించామని ఆఫీసర్లు చెప్పారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించి ఇప్పటిదాకా 25 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ పోలీసులు చెప్పారు. 394 మంది సిబ్బంది గాయపడ్డారని, 30 పోలీసు వాహనాలు డ్యామేజ్ అయ్యాయని తెలిపారు.

సింఘు నుంచి వెళ్లిపోండి: స్థానికులు

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లలో ఆందోళనలు చేస్తున్న రైతులకు అక్కడి స్థానికుల నిరసనల సెగ తగిలింది. సింఘు బార్డర్ నుంచి వెళ్లిపోవాలంటూ లోకల్స్ డిమాండ్ చేశారు. జాతీయ జెండాలతో వచ్చిన జనం.. రిపబ్లిక్‌‌ డే రోజున దేశాన్ని, జాతీయ జెండాను అవమానించారంటూ మండిపడ్డారు. ‘సింఘు బార్డర్ ఖాళీ కరో’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు రైతు శిబిరాలకు కరెంటు, నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. పారామిలటరీ బలగాలతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

పోలీసులను పరామర్శించిన అమిత్ షా

రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా గొడవల్లో గాయపడ్డ పోలీసులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరామర్శించారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత డాక్టర్లతోనూ చర్చించారు. పోలీసుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. “గాయపడ్డ పోలీసులను కలిశాను. వారి ధైర్య సాహసాలను చూసి గర్వపడుతున్నాం” అని ట్వీట్ చేశారు.

నిరసనలు విరమించుకున్న మరో రెండు సంఘాలు

ట్రాక్టర్​ర్యాలీలో జరిగిన హింస నేపథ్యంలో మరో రెండు రైతు సంఘాలు నిరసనల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ప్రొటెస్టుల నుంచి కిసాన్ మహా పంచాయత్, భారతీయ కిసాన్ యూనియన్ (లోక్​శక్తి) తప్పుకున్నాయి. బుధవారం ఆలిండియా కిసాన్‌‌‌‌ సంఘర్ష్‌‌‌‌ కోఆర్డినేషన్‌‌‌‌ కమిటీ (ఏఐకేఎస్‌‌‌‌సీసీ), భారతీయ కిసాన్ యూనియన్ (భాను) ఆందోళనలను విరమించుకున్నాయి.

వెళ్లిపోవాలని లోకల్స్ డిమాండ్

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లలో ఆందోళనలు చేస్తున్న రైతులకు అక్కడి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. సింఘు బార్డర్ నుంచి వెళ్లిపోవాలంటూ లోకల్స్ డిమాండ్ చేశారు. జాతీయ జెండాలతో వచ్చిన జనం.. ‘సింఘు బార్డర్ ఖాళీ కరో’ అంటూ నినాదాలు చేశారు. రైతుల ప్రొటెస్టుల వల్ల తమ వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయని కొందరు గొడవకు దిగారు.  రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేసి రైతులు.. జాతీయ జెండాను అవమానించారని మరికొందరు విమర్శించారు.

లుకౌట్ నోటీసులు

రిపబ్లిక్ డే రోజున హింసకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన రైతు నేతలపై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.  మొత్తం 33 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశామని, 44 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు చెప్పారు.

కొందరు ముందే వెళ్లారు

ఢిల్లీ బార్డర్​ విడిచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు చేయడంతో కొంత మంది రైతులు సామాను సర్దుకుని ఇండ్లకు వెళ్లిపోయారు. ఇప్పటిదాకా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు నాలుగు సంఘాలు ప్రకటించాయి.

మరింత మంది వస్తరు

తాము ఆందోళనలు ఆపబోమని రాకేశ్‌‌‌‌ తికాయత్‌‌‌‌ చెప్పారు. చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. గురువారం నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. తమ ఊరి నీళ్లు మాత్రమే తాగుతానని చెప్పారు. ‘‘శాంతియుతంగా నిరసనలు చేయొచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఘాజీపూర్ బార్డర్​లో ఎలాంటి హింస జరగలేదు. కానీ ప్రభుత్వం అణచివేత విధానం అవలంబిస్తోంది. ఇది యూపీ ప్రభుత్వం నిజస్వరూపం” అని ఆరోపించారు. గురువారం సాయంత్రం ఘాజీపూర్ బార్డర్​లో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జనవరి 26 నాటి ఘటనపై సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అవసరమనుకుంటే గ్రామాల నుంచి మరింత మంది వస్తారని హెచ్చరించారు. ‘‘మేం సరెండర్ కాబోం. పోలీసులు మమ్మల్ని అరెస్టు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఏదైనా తప్పుడు పని చేయాలనుకుంటే మాత్రం.. ఉరివేసుకుంటా’’ అని హెచ్చరించారు. ‘‘వెళ్లిపోవాలనిఅంటున్నారు. ప్రొటెస్టర్లు వెనక్కి వెళ్లే సమయంలో హింసకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. మేం ఇక్కడే ఉంటాం. బుల్లెట్లనూ ఎదుర్కొంటాం” అని చెప్పారు.

ఎఫ్ఐఆర్​లలో 37 మంది లీడర్ల పేర్లు

ఎఫ్​ఐఆర్​లలో 37 మంది ఫార్మర్ లీడర్ల పేర్లను పోలీసులు నమోదు చేశారు. దేశద్రోహం, హత్యాయత్నం, దోపిడీ, కుట్ర తదితర అభియోగాలు మోపారు. రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్, మేధా పాట్కర్, దర్శన్ పాల్, గుర్నాంగ్ సింగ్ ఛందుని, కుల్వంత్ సింగ్ సంధు, సత్నాం సింగ్ పన్ను, జోగిందర్ సింగ్ ఉగ్రహా, సుర్జీత్ సింగ్ ఫూల్, జగ్​జీత్ సింగ్ దలేవాల్, బల్బీర్ సింగ్ రాజేవాల్, హరీందర్ సింగ్ లఖోవాల్ తదితరులపై కేసులు పెట్టారు. అంతకుముందు యాక్టర్ దీప్ సిధు, గ్యాంగ్​స్టర్ నుంచి సోషల్ యాక్టివిస్ట్​గా మారిన లఖా సిధానపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు తప్పు చేసినట్లు తేలితే కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెప్పారు. పరేడ్ సందర్భంగా తాము విధించిన షరతులను ఎందుకు పాటించలేదో చెప్పాలని రైతు నేతలను పోలీసులు ప్రశ్నించారు. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిందితులను గుర్తించేందుకు తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

44 మందిపై లుకౌట్ నోటీసులు

రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన రైతు నేతలకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిందితులు దేశం విడిచి వెళ్లిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ ఆర్డర్లిచ్చామని ఢిల్లీ పోలీస్ చీఫ్ ఎస్ఎన్ శ్రీవాస్తవ చెప్పారు. మొత్తం 33 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశామని, 44 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. 9 ఎఫ్ఐఆర్​లను క్రైమ్ బ్రాంచ్​కు ట్రాన్స్​ఫర్ చేశారు. ఈ కేసులను దర్యాప్తు చేసేందుకు స్పెషల్ సెల్ సాయం చేస్తుంది.

మూడు చట్టాల చెల్లుబాటుపై వివరణ ఇవ్వండి: సుప్రీం

కొత్త వ్యవసాయ చట్టాల రాజ్యాంగపరమైన చెల్లుబాటుపై కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్​పై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ తో కూడిన బెంచ్.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కొత్త చట్టాలకు సంబంధించి పెండింగ్​లో ఉన్న వాటికి ఈ పిటిషన్ కూడా ట్యాగ్ చేయాలని ఆదేశించింది. ఆర్టికల్ 14 (రైట్ టు ఈక్వాలిటీ), 15(ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్), 21(రైట్ టు లైఫ్, లిబర్టీ)ని ఉల్లంఘించేవిగా కొత్త చట్టాలు ఉన్నాయని ప్రతాపన్ తన పిటిషన్​లో పేర్కొన్నారు.