మాజీ ఎంపీటీసీని కొట్టి చంపి.. డంపింగ్ యార్డ్ లో పూడ్చివేత

ఘట్ కేసర్, వెలుగు: మాజీ ఎంపీటీసీ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ప్రత్యర్థులే మర్డర్ చేసినట్టు తేలింది. ఘట్ కేసర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్  అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మేడ్చల్ జిల్లా మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(48)  రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాగా.. అదే కాలనీకి చెందిన శ్రీనివాస్ అలియాస్ చిన్న(36), కడపొల్ల ప్రవీణ్(24)ల మధ్య భూవివాదం నెలకొనగా.. కోర్టులో కేసులు విచారణలో ఉన్నాయి.  తమ కబ్జాలోని ప్లాట్లను మహేశ్​ రిజిస్టర్ చేయించుకుని కోర్టు ద్వారా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నాడని,  అతడిని చంపాలని , అందుకు మహేశ్​ రియల్ ఎస్టేట్ ఆఫీసులోనే  చేయాలని వారు ప్లాన్ చేశారు.  

ఈనెల14న రాజీ చేసుకుందామని మహేశ్​ను ఆఫీసుకు రావాలని కోరారు. సిటీలో ఉన్నందున రాలేకపోతున్నట్లు అతడు చెప్పగా.. ఈనెల15న ఉదయం రావాలని కోరారు. ఆ రోజు ఉదయం తన ఆఫీసులోకి వెళ్లిన మహేశ్ కళ్లలో ప్రవీణ్, శ్రీనివాస్ కారం పొడి కొట్టి, కర్రలతో తలపై కొట్టడంతో స్పాట్ లో  చనిపోయాడు. ఆ తర్వాత షట్టర్ కు తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రికి మళ్లీ వచ్చి మృతుడి కారులోనే  కొండాపూర్ శివారులోని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లారు. జేసీబీతో గుంత తీసి డెడ్ బాడీని పూడ్చి వేశారు.  

 అన్న కనిపించడంలేదని.. 

ఇంట్లోంచి వెళ్లిన అన్న 4 రోజులుగా తిరిగి రాకపోగా, కనిపించడం లేదని అతని తమ్ముడు విఠల్ ఈనెల 21న ఘట్ కేసర్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ పుటేజీలు, మహేశ్ ​ఫోన్ కాల్ లిస్ట్ వివరాలు  పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుసుకుని నిందితులు ఆదివారం రాత్రి మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి ఎదుట లొంగిపోయారు. మహేశ్​ ను మర్డర్ చేసినట్టు ఒప్పుకున్నారు. కడపొల్ల శ్రీరాములు, రాజు,  జేసీబీ యజమాని కడపొల్ల నరేష్,  డ్రైవర్ సోహన్ సాయంతో  డెడ్ బాడీని పాతిపెట్టామని వివరించారు. 

ఇద్దరిని అదుపులోకి తీసుకుని సోమవారం  డంపింగ్ యార్డుకు వెళ్లి  డెడ్ బాడీని వెలికితీశారు. డిప్యూటీ తహశీల్దార్ సందీప్ రెడ్డి పంచనామా చేశారు. గాంధీ డాక్టర్ మహేందర్ రెడ్డి టీమ్ పోస్టుమార్టం చేసిన అనంతరం డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు. దీంతో మృతుడి బంధువులు ఎదులాబాద్ రోడ్డులోని నిందితుల ఇంటి వద్ద ధర్నాకు దిగారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే మహేశ్​ను హత్య చేశారని, దీని వెనక స్థానిక నేతల హస్తం ఉందని ఆరోపించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, తమకు అప్పగించాలని పట్టుపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.