ఆగష్టు 24 నుంచి గెల్వలాంబ ఉత్సవాలు

  •     ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

వంగూర్, వెలుగు : ఈ నెల 24 నుంచి 28 వరకు మండల కేంద్రంలోని గెల్వలాంబ మాత ఉత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన గెల్వలాంబ మాత ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని ఆరాధిస్తుంటారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వారం రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గెల్వలాంబ అమ్మవారిని వేడుకుంటే తమ సమస్యలు దూరమవుతాయని ఇక్కడి భక్తులు నమ్ముతారు.

 ఉత్సవాల్లో భాగంగా 24 న ఉదయం 6 గంటలకు మేలుకొలుపు, తోరణ అలంకరణ, మంగళ వాయిద్యాలతో ధ్వజారోహణము, గణపతి పూజ, నవగ్రహ పూజ, అఖండ దీపారాధన, నిత్యాచరణ, అమృతాభిషేకం, మంగళహారతి ఉదయం 10 గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం, సాయంత్రం 4 గంటలకు నాజర్  బోనాలు, వైశ్యుల బోనాలు, బండ్లు, వాహనాలు తిరుగుతాయి. 

25న బోయ, రెడ్డి, గౌడ, పద్మశాలి, వివిధ బీసీ కులాలకు సంబంధించిన బోనాలు, బండ్లు తిరుగుతాయి. 26న ముదిరాజ్ బోనాలు, బండ్లు తిరుగుతాయి. 27న రథోత్సవం,28న యాదవుల ఆధ్వర్యంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ చైర్మన్  అందుగుల వెంకటస్వామి తెలిపారు.