ముంబై: ప్రపంచంలోనే ఐదవ అత్యంత సంపన్నుడు అయిన గౌతమ్ అదానీ, హెల్త్‌కేర్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం రెండు పెద్ద ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ చైన్‌లు, ఆఫ్‌లైన్, డిజిటల్ ఫార్మసీలు వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాల నుండి ఓడరేవుల వరకు రకరకాల వ్యాపారాలను నిర్వహించే అదానీ గ్రూప్‌లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవల అనేక విదేశీ బ్యాంకులు, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను కలిశారు. హెల్త్‌కేర్ వ్యాపారానికి సంబంధించి తమ గ్రూప్ ప్లాన్ల గురించి వివరించారు. ఇండియా మార్కెట్ కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటుకు అదానీ గ్రూప్ హెల్త్‌కేర్ సెక్టార్‌లోని కొన్ని బడా కంపెనీలతో చర్చిస్తోంది. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన రావచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ బిజినెస్ కోసం డెట్ ఈక్విటీ మిక్స్‌లో నాలుగు బిలియన్ల డాలర్ల వరకు (దాదాపు రూ.30 వేల కోట్లు) కేటాయిస్తారు. ఈ డబ్బు కోసం లెండర్లతో కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. ‘‘హెల్త్‌కేర్ సెక్టార్లో అపార అవకాశాలు ఉన్నాయని అదానీ గ్రూపు గుర్తించింది. ఈ రంగంలో అడుగుపెట్టేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం హెల్త్‌కేర్ సెక్టార్ ప్రాంతీయ సంస్థల చేతుల్లో ఉంది కానీ వీళ్లకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. హెల్త్‌కేర్ సెక్టార్‌లో పెద్ద మొత్తంలో ప్రైవేట్ ఈక్విటీ క్యాపిటల్‌ను ఇన్వెస్ట్ చేశారు”అని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వివరించారు. మనదేశంలో జనాభాకు తగినన్ని ఆసుపత్రి బెడ్లు లేవు. 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది. మధ్యతరగతి జనంలో షుగుర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. ఇవన్నీ హెల్త్‌కేర్ సెక్టార్ ఎదుగుదలకు దారితీస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్‌లు...
హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ సహా పథకాలను ప్రకటించింది. ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజ్‌లు మనదేశంలోనే తయారయ్యేలా స్కీమ్స్ తెచ్చింది. మనదేశంలో పెద్ద కంపెనీలు ఈ రంగంలోకి దిగుతున్నాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.620 కోట్లకు ఆన్‌లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్ (విటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. నిరుడు జూన్‌లో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ టాటా డిజిటల్ లిమిటెడ్.. డిజిటల్ హెల్త్ కంపెనీ ఈ–-ఫార్మసీ 1ఎంజీ టెక్నాలజీస్ ప్రైవేట్‌లో మెజారిటీ వాటాను దక్కించుకుంది. మరో ఆన్‌లైన్ ఫార్మసీ రీటైలర్ ఏపీఐ హోల్డింగ్స్ అదే నెలలో థైరోకేర్ టెక్నాలజీస్‌లో రూ.4,546 కోట్లకు మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. యూఎస్ ఆన్‌లైన్ రిటైల్ కంపెనీ అమెజాన్ పోయిన ఆగస్టులో భారతదేశంలో తన ఆన్‌లైన్ ఫార్మసీని ప్రారంభించింది. 1988లో ఏర్పడ్డ అదానీ గ్రూప్ 20 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయంతో నడుస్తున్న భారతదేశపు అతిపెద్ద బిజినెస్ గ్రూపుల్లో ఒకటి. ఇది పవర్, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎయిర్‌పోర్టుల మేనేజ్మెంట్ వ్యాపారాలు చేస్తోంది. స్విస్ సిమెంట్ తయారీ సంస్థ హోల్సిమ్ గ్రూప్ కు అంబుజా సిమెంట్స్ , ఏసీసీ లోని వాటాలను కొనుగోలు చేయడానికి పోటీ పడుతోంది. ఈ రెండు యూనిట్ల విలువ 10 –15 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది.
