Gautam Gambhir: కోహ్లీపై పాంటింగ్ విమర్శలు..ఆసీస్ మాజీ కెప్టెన్‌కు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు మాటల యుద్ధం మొదలైంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, భారత హెడ్ కోచ్ గంభీర్ ల మధ్య చిన్నపాటి వార్ నడించింది. మొదటగా పాంటింగ్ మాట్లాడుతూ.. "కోహ్లీకి గత ఐదేళ్లలో రెండే సెంచరీలు చేశాడు. ఇది భారత్ కు ఆందోళన కలిగించే అంశం" అని అన్నాడు. దీనికి టీమిండియా హెడ్ కోచ్ ఘాటుగా స్పందించాడు. 

సోమవారం (నవంబర్ 11) భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా బయలుదేరే ముందుగా గంభీర్ పాంటింగ్ కు కౌంటర్ ఇచ్చాడు. విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్‌పై మండిపడ్డాడు. పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించుకోవాలని..భారత క్రికెట్‌కు పాంటింగ్‌కు సంబంధం ఏంటి అని విరుచుకుపడ్డాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్ పై మాకు ఎలాంటి ఆందోళన లేదని ఈ సందర్భంగా తెలియజేశాడు. 

ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. పేలవ ఫామ్ లో ఉన్న విరాట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ తో పాటు యావత్ దేశం కోరుకుంటుంది. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ ఫామ్ ఘోరంగా ఉంది. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన 5 ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ముందు అనుభవజ్ఞుడు కోహ్లీ ఫామ్ లోకి రాకపోతే భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం కష్టంగానే కనిపిస్తుంది. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ప్రస్తుతం భారత జట్టు దృష్టి మొత్తం ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. మరోవైపు టీమిండియా పేలవ ఫామ్ లో ఉంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.