కరణ్​ అదానీ చేతికి సిమెంట్​ బిజినెస్​

కరణ్​ అదానీ చేతికి సిమెంట్​ బిజినెస్​

న్యూఢిల్లీ : గౌతమ్​ అదానీ తన పెద్ద కొడుకు కరణ్​ అదానీకి సిమెంట్​ వ్యాపారాన్ని అప్పగించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏసీసీ, అంబుజా సిమెంట్​ కంపెనీల్లో వాటాను అదానీ గ్రూపు ఇటీవలే కొనుగోలు చేసింది. కరణ్‌‌ను​ ముందుంచి నడిపించడంతోపాటు సిమెంట్​ బిజినెస్​ను త్వరగా డెవెలప్​ చేయడానికి కొంతమంది సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ల టీమ్​ను తయారు చేసినట్టు తెలుస్తోంది. 35 ఏళ్ల కరణ్​ ప్రస్తుతం అదానీ పోర్ట్స్​ అండ్​స్పెషల్​ ఎకనమిక్​ జోన్ ​సీఈఓగా పనిచేస్తున్నారు. సమగ్రమైన లాజిస్టిక్స్​ కంపెనీని తయారు చేయడానికి అదానీ పోర్ట్స్‌‌​, సిమెంట్​ వ్యాపారాన్ని ఒక్క తాటిపై నడిపిస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కరణ్​ నియామకంపై మీడియా అడిగిన ప్రశ్నలకు అదానీ గ్రూప్​ నుంచి రెస్పాన్స్​ రాలేదు. పెరుగుతున్న బొగ్గు ధరలు, భారీగా ఈక్విటీ లాభాల వల్ల అదానీల సంపద భారీగా పెరుగుతోంది. విమానాశ్రయాలు, మీడియా, డిజిటల్ సేవలు , టెలికమ్యూనికేషన్‌‌‌‌లలో వేగంగా విస్తరించింది.   గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్​ కోసం70 బిలియన్​ డాలర్లు ఖర్చు చేస్తామని కూడా అదానీ ప్రకటించారు.  ఈ ఏడాది మేలో స్విట్జర్లాండ్‌‌‌‌లోని హోల్సిమ్ లిమిటెడ్ నుండి అంబుజా సిమెంట్స్ ,  ఏసీసీ లిమిటెడ్‌‌‌‌లను కొనుగోలు చేయడం ద్వారా భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అదానీ గ్రూపు ఎదిగింది. 

పూర్తయిన కొనుగోలు ప్రక్రియ...
ఏసీసీ, అంబుజా సిమెంట్స్​లో వాటాలు కొనడం పూర్తయిందని ఈ గ్రూపు ప్రకటించింది.  అంబుజా సిమెంట్స్‌‌‌‌లో 63.1 శాతం అదానీ గ్రూప్​కు దక్కుతుంది. అంబుజా లోకల్​ సబ్సిడరీల్లో ఏసీసీ లిమిటెడ్ కూడా ఉంది.  హోల్సిమ్​కు అంబుజా సిమెంట్స్‌‌‌‌లో 63.19 శాతం,  ఏసీసీలో 54.53 శాతం (దీనిలో 50.05 శాతం అంబుజా సిమెంట్స్ ద్వారా నిర్వహిస్తారు) వాటాలు సొంతమవుతాయి. అంబుజా  షేరుకు రూ.385 చొప్పున, ఏసీసీ షేరుకు రూ.2,300 చొప్పున అదానీ గ్రూప్ చెల్లించింది. ఇందుకోసం  దాదాపు రూ.51 వేల కోట్లు కేటాయించింది. 

సంపదలో అదానీ నం.2.. కానీ కొంతసేపే...
వరల్డ్​ రిచెస్ట్​ పర్సన్​ లిస్టులో రెండోస్థానంలో ఉన్న ఫ్రెంచ్ లగ్జరీ రిటైల్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను అదానీ వెనక్కి నెట్టేశారు. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డులకు ఎక్కారు. అయితే ఈ రికార్డు ఎక్కువసేపు ఉండలేదు. మార్కెట్ క్రాష్ కారణంగా కాసేపటికే హోదాను కోల్పోయారు. ఇంట్రాడేలో అదానీ సంపద 155.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.  గ్రూప్ స్టాక్స్ చాలా వరకు నష్టాల్లో ముగియడంతో ఆయన నెట్​వర్త్​ 152.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో మళ్లీ మూడవ స్థానానికి పడిపోయారు.  లగ్జరీ గూడ్స్ కంపెనీ లూయిస్​ విట్టన్​ను నడిపే బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబ సంపద నికర విలువ దాదాపు 153.1 బిలియన్ డాలర్లతో నంబర్ 2 స్థానంలో ఉన్నారు. అదానీ 149.7 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ ఫౌండర్​ జెఫ్ బెజోస్ కంటే ముందున్నారు. టాప్ 10 బిలియనీర్ల జాబితాలో బిల్ గేట్స్ (105.3 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (96.5 బిలియన్ డాలర్లు), ముకేశ్‌‌ అంబానీ (91.6 బిలియన్ డాలర్లు) ఉన్నారు.