రెడీ ఫర్​ గేట్​ : గేట్ 2025 నొటిపికేషన్ విడుదల

ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ + పీహెచ్డీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇం ఇంజినీరింగ్.. సంక్షిప్తంగా..గేట్. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్యూ).. ఎంట్రీ లెవల్లో ఇంజినీర్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికంగా నిలుస్తోంది. అందుకే ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు. గేట్–2025 నోటిఫికేషన్ విడుదలైంది.

ఈసారి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు నెలాఖరులో దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. గేట్తో ప్రయోజనాలు, ఎగ్జామ్​ ప్యాటర్న్​, సిలబస్ విశ్లేషణతోపాటు ప్రిపరేషన్​ ప్లాన్​ తెలుసుకుందాం..

ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్​లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు గేట్ తొలి మెట్టు​. ఆ స్కోర్తో ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఏటా గేట్కు అప్లై చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.

ఐఐటీల్లోనూ ముఖాముఖి: ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్+పీహెచ్డీ వంటి ప్రోగ్రామ్లలో ప్రవేశానికి గేట్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఐఐటీలు సైతం మలి దశలో గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్స్ పేరిట పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు రిటెన్ ఎస్సేలు నిర్వహించే విధానాన్ని కూడా అనుసరిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే సీట్లు ఖరారు అవుతున్నాయి.

జీడీ/ఇంటర్వ్యూ:  పీఎస్యూల ఎంపిక ప్రక్రియలో చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూ. గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్లో చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్జ్లను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.

నెగిటివ్ మార్కులు: గేట్లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మార్కులు తగ్గుతాయి. న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు. 

ప్రిపరేషన్​ ప్లాన్​:  అభ్యర్థులకు సుమారు ఆరు నెలలు సమయం ఉన్నందున ముందు సిలబస్, పరీక్ష విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. మంచి స్కోర్​ సాధించాలంటే ఎంచుకున్న సబ్జెక్ట్​లోని బేసిక్స్​ మీద పట్టు సాధించాలి.  ప్రీవియస్​ పేపర్స్​ పరిశీలించి, ఏ టాపిక్స్​ నుంచి ఎన్ని మార్కులు ఇస్తున్నారో గమనించాలి. వీక్లి టెస్టులు, మాక్​ టెస్టులు, మోడల్​ టెస్టులు ఎక్కువగా ప్రాక్టీస్​ చేయాలి. గేట్ సిలబస్ను అకడమిక్ సిలబస్తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్​ చివరి వారం వరకు ప్రిపరేషన్​ పూర్తి చేసుకొని రివిజన్​కు సమయం కేటాయించాలి.

మంచి స్కోర్కు మార్గం:  ఎంచుకున్న సబ్జెక్ట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వరకూ.. పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్ను చదివేటప్పుడు ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించడంతోపాటు దానికి సంబంధించి ప్రా­థమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో గుర్తించి సాధన చేయాలి. గేట్ సిలబస్ను అకడమిక్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. వీక్లీ టెస్ట్లు,మాక్ టెస్ట్­లు, మోడల్ టెస్ట్లకు హాజరు కావాలి. ఈ అప్రోచ్ విజయ సాధనలో ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది.

ప్రాధాన్యతను గుర్తిస్తూ: అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్లోని టాపిక్స్కు లభిస్తున్న వెయిటేజ్, అకడమిక్గా ఉన్న ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఉన్న వ్యవధిలో ఆన్లైన్ మోడల్ టెస్ట్లు, మాక్ టెస్ట్లకు హాజరయ్యే విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. పరీక్షలో మంచి స్కోర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

ప్రశ్నల రకాలు:  గేట్లో ప్రశ్నలను మూడు విధాలుగా అడుగుతారు. అవి.. ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్, మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (ఎన్ఏటీ) ప్రశ్నలు ఉంటాయి. ఎంసీక్యూ విధానంలో నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్ విధానంలో అడిగే ప్రశ్నలకు.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే.. సంబంధిత టాపిక్పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగుండాలి. న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్తో కూడినవిగా ఉంటాయి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​:  గేట్ ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. 
విభాగం-1: (జనరల్ ఆప్టిట్యూడ్): ఈ విభాగం నుంచి 15 మార్కులు వస్తాయి. ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఐదు ఒక మార్కు ప్రశ్నలు, మరో ఐదు రెండు మార్కులు ప్రశ్నలు. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లీష్ సంబంధితం (వెర్బల్ ఎబిలిటీ). మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్కు సంబంధించినవి ఇవ్వొచ్చు. రోజూ వార్తాపత్రికలు చదవడం, ఇతర పోటీ పరీక్షల (ఉదా: క్యాట్) గత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే ఈ విభాగంలో మంచి మార్కులు వస్తాయి.  
విభాగం-2: (ఇంజినీరింగ్ సబ్జెక్టు): ఇందులో నుంచి 85 మార్కులు వస్తాయి.  ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 25 ఒక మార్కు ప్రశ్నలు, 30 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. గణితం నుంచి 10 - 15 మార్కులు. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్ అప్లికేషన్తో ఉంటాయి.  ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి.  

గేట్తో ప్రయోజనాలు

గేట్ స్కోర్ ఆధారంగా ఆయా విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్డీలో ప్రవేశాలు ఖరారు చేసుకున్న వారి­కి పలు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఎంటెక్ వంటి పీజీ ప్రోగ్రామ్లో అడుగుపెడితే నెలకు రూ.12,400 స్టయిఫండ్, పీహెచ్డీలో చేరితే నెలకు రూ.28 వేల స్కాలర్షిప్ అందుతుంది. రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో పీజీలో ప్రవేశాలకు సంబంధించి గేట్ ఉత్తీర్ణులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.

నోటిఫికేషన్​ 

అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్
పరీక్ష తేదీలు: 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి.
వెబ్​సైట్​: www.gate2025.iitr.ac.in