న్యూఢిల్లీ: ఏపీలోని విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున జరిగిన కెమికల్ గ్యాస్ లీకేజీ ప్రభావం రైళ్ల సర్వీసులపైనా పడింది. దాదాపు 45 రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది. వీటిలో మైగ్రంట్ వర్కర్స్ ను తరలిస్తున్న 9 శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. మిగతావన్నీ గూడ్స్ రైళ్లు. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువు లీక్ కావడంతో కళ్లల్లో మంట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వల్ల సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ లోని సిబ్బంది పనులు ఆపేశారు. దీంతో ఉదయం 8.35 నుంచి మధ్యాహ్నం 12 వరకు రైళ్లు ఆగిపోయాయి. మైగ్రంట్ వర్కర్స్ ను తరలిస్తున్న అబు రోడ్ – విశాఖపట్నం, దర్భంగా – త్రిస్సూర్, హాతియా- ఎర్నాకులం, సహర్స- చింతకుంట, పాలక్కాడ్- జగన్నాథ్ పూర్ ట్రైన్స్ కు అంతరాయం కలిగింది. ఘట్ కేసర్ – కటిహార్, కట్పాడి – హాతియా, లింగంపల్లి – భగల్ పూర్, కోజిక్కో్డ్ – కటిహార్ రైళ్లను విజయవాడ, బలార్ష మీదుగా దారి మళ్లించారు. విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ లో కెమికల్ గ్యాస్ లీకై 11 మంది చనిపోయారు. వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఐదు కిలోమీటర్ల రేడియస్ లోని గ్రామాల్లో విషవాయువు ప్రభావం ఉన్నట్లు అధికారులు చెప్పారు.

