గద్వాలలో చెత్తలొల్లి .. చేతులెత్తేసిన ప్రైవేట్​ ఏజెన్సీ

  • గద్వాల టౌన్ లో ఐదు రోజులుగా చెత్త సేకరణ బంద్
  • దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు

గద్వాల, వెలుగు: చెత్త సేకరణపై గద్వాల మున్సిపాలిటీలో గందరగోళం నెలకొంది. చెత్త సేకరణ కోసం ప్రతి నెలా ప్రజలు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఐదు రోజుల నుంచి ప్రైవేట్  ఏజెన్సీ చెత్త సేకరణను నిలిపేసింది. దీంతో గద్వాల మున్సిపాలిటీలో చెత్త సేకరణ ఆగిపోయింది. ఆరు నెలల కింద మున్సిపాలిటీలో పని చేస్తున్న 20 మంది కార్మికులను తొలగించి ప్రైవేట్  ఏజెన్సీకి చెత్త సేకరణ బాధ్యతలను అప్పజెప్పారు. అయితే ప్రైవేట్  ఏజెన్సీ వారు చేతులెత్తేయడంతో చెత్త సేకరణ ఎలా చేయాలనే దానిపై సందిగ్ధత నెలకొంది.

భారం తగ్గించుకునేందుకు ప్రైవేటీకరణ..

గద్వాల మున్సిపాలిటీపై భారం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీలో చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేట్  ఏజెన్సీకి అప్పగిస్తూ ఆరు నెలల కింద నిర్ణయం తీసుకున్నారు. గద్వాల మున్సిపాలిటీలోని 18 ఆటోలను ప్రైవేట్​ ఏజెన్సీకి అప్పగించగా, వెహికల్స్​లో డీజిల్  పోసుకొని డ్రైవర్లను పెట్టుకుని చెత్త సేకరించాలని నిర్ణయించారు.

ప్రైవేట్  ఏజెన్సీకి చెత్త సేకరణ బాధ్యతలు అప్పజెపితే గద్వాల మున్సిపాలిటీకి నెలకు రూ.10 లక్షల వరకు ఖర్చు ఆదా అవుతుందని అంచనా వేశారు. అందులో భాగంగా వనపర్తికి చెందిన ఓ ప్రైవేట్  ఏజెన్సీకి ఇంటింటికీ రూ.60 చొప్పున వసూలు చేసి చెత్త సేకరించేలా బాధ్యతను అప్పగించారు. మున్సిపాలిటీలో చాలా ఇండ్ల ఓనర్స్​ ప్రతి నెలా రూ.60 ఇవ్వడం లేదని, దీంతో తాము చెత్త సేకరించలేమని ఐదు రోజుల కింద చేతులెత్తేసిన ఏజెన్సీ నిర్వాహకులు ఆటోలను మున్సిపాలిటీలో పెట్టేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి చెత్త సేకరణ నిలిచిపోయింది.

చెత్త సేకరించేది ఎలా?

ప్రైవేట్  ఏజెన్సీకి చెత్త సేకరణ బాధ్యతలు అప్పగించిన తరువాత గద్వాల మున్సిపాలిటీలో పని చేస్తున్న 20 మంది కార్మికులను తొలగించారు. ఇందులో 18 మంది ఆటో డ్రైవర్లు, ఇద్దరు ఇతర సిబ్బంది ఉన్నారు. ఉన్న ఫలంగా ప్రైవేట్  ఏజెన్సీ వారు చేతులెత్తేయడంతో ఇప్పుడు గద్వాల మున్సిపాలిటీలో చెత్త సేకరణ ఎలా చేయాలనే ఆందోళన కనిపిస్తోంది. మున్సిపాలిటీలో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ చేయకపోవడంతో రోడ్లపైనే చెత్త వేస్తున్నారు.

అసలే వానాకాలం కావడం, చెత్త రోడ్లపై వేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రజలు వాపోతున్నారు. ఇదిలాఉంటే చెత్త సేకరణ బాధ్యతను ప్రైవేట్  వారికి ఇచ్చినప్పటి నుంచి కౌన్సిల్  సపోర్ట్  లేదని అంటున్నారు. కార్మికులను తొలగించడంపై పాలకవర్గం, మున్సిపల్  ఆఫీసర్ల మధ్య కోల్డ్ వార్  కొనసాగుతూనే ఉంది. ప్రతి మీటింగ్ లో సిబ్బందిని తొలగించడంపై చైర్మన్, కౌన్సిలర్లు ఆఫీసర్లను ప్రశ్నిస్తూనే ఉన్నారు. మున్సిపాలిటీకి మేలు జరుగుతుందని చెప్పినా వినిపించుకోకుండా సిబ్బందిని తీసుకోవాలని పట్టుబడుతూ వచ్చారు. ఈ తరుణంలో ఏజెన్సీ చేతులెత్తేయడంతో మళ్లీ పాత పద్ధతిలో చెత్త సేకరించేందుకు మున్సిపల్​ ఆఫీసర్లు చర్యలు 
ప్రారంభిస్తున్నారు.

మున్సిపాలిటీని ముట్టడిస్తాం..

చెత్త సేకరించకుండా నిర్లక్ష్యం చేస్తే గద్వాల మున్సిపాలిటీని ముట్టడిస్తాం. వర్షాలు కురుస్తున్న తరుణంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటే ఈగలు, దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడతారు. వెంటనే మున్సిపల్​ ఆఫీసర్లు చెత్తను తొలగించాలి.

రజక జయశ్రీ, కౌన్సిలర్

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..

చెత్త సేకరించకుండా ప్రైవేట్  ఏజెన్సీ చేతులెత్తేసిన విషయం వాస్తవమే. సిబ్బందితో చెత్త సేకరించి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

మన్సూర్, శానిటరీ ఇన్స్​పెక్టర్