శివ్వంపేట మండలంలో గుప్పు మంటున్న గంజాయి

  • అడిక్ట్ అవుతున్న యువత..  మత్తులో దాడులు, దారుణాలు  

మెదక్, శివ్వంపేట, వెలుగు: జిల్లాలోని శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి గుప్పు మంటోంది. మండలంలో కంపెనీలు ఉండడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తారు. కిక్కు కోసం మత్తు పదార్థాల వాడకం పెరిగింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా సీక్రెట్ గా ఎండు గంజాయి మండలానికి చేరుతోంది. మండలంలోని గోమారం, దొంతి, చండి, శివ్వంపేట, పెద్ద గొట్టిముక్కుల, శభాష్ పల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. 

కోడ్​ భాషలో అమ్మకాలు

గంజాయిని 50, 100 గ్రాముల పాకెట్లుగా చేసి పాన్ షాప్ లు, హోటళ్లు, కిరణా షాప్​ల్లో అమ్ముతున్నారు. కొన్నిచోట్ల పోలీసులకు, ఎక్సైజ్​ అధికారులకు దొరక్కుండా ఉండేందుకు చాక్లెట్, సిగరెట్ల రూపంలో అమ్మకాలు జరుగుతున్నాయి. గంజాయి విక్రయించే వారు కోడ్​ భాషలో గంజాయి అమ్ముతున్నట్టు తెలిసింది. గంజాయి కావాల్సిన వారు వచ్చి కోడ్​ చెబితే ఆయా పాన్​ షాప్​లు, హోటళ్లు, కిరాణా షాప్​లలో గంజాయి పాకెట్లు, చాక్లెట్లు, సిగరెట్లు ఇస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిసింది.  

యువత పెడదారి

 కార్మికులతో పాటు ఆయా గ్రామాల పరిధిలో యువత గంజాయికి అలవాటు పడ్డారు. కొందరు దానికి ఎడిక్ట్ అయ్యారు.  గంజాయి మత్తులో కొందరు గొడవలకు దిగుతూ, దాడులకు, దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మండలంలోని  గోమారంలో దొంగతనానికి పాల్పడ్డాడనే అనుమానంతో ఇద్దరు యువకులు ఓ భిక్షగాడిని విచక్షణ రహితంగా కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘనకు కూడా గంజాయి కారణమనే ఆరోపణలు వినిపించాయి. ఆదివారం మండల పరిధిలోని పెద్ద గొట్టిముక్లలో కొందరు యువకులు గంజాయి మత్తులో ఓ పాల వ్యాపారిపై దాడి చేశారు. ఇది గమనించి ఆపేందుకు వెళ్లిన వ్యక్తిని కూడా కొట్టారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

గంజాయిని అరికట్టాలి

మండలంలోని వివిధ గ్రామాలకు గంజాయి సరఫరా అవుతున్నట్టు తెలిసింది. యువకులు గంజాయికి అలవాటుపడి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. పోలీసులు, ఎక్సైజ్​ అధికారులు నిఘా పెట్టి గంజాయి సరఫరా, అమ్మకాలను అరికట్టాలి. గ్రామాల్లో గంజాయి వల్ల కలిగే నష్టాలపై యువకులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి.    మహేశ్​గుప్తా, మాజీ జడ్పీటీసీ, శివ్వంపేట

పోలీస్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లా

కొన్నాళ్లుగా శివ్వంపేట మండలంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని తూప్రాన్​ సీఐ, డీఎస్పీల దృష్టికి తీసుకెళ్లాను. యువత జీవితాలు నాశనం చేసే గంజాయిని పూర్తిగా అరికట్టాలని సూచించారు.  

సునీతారెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్​

మా దృష్టకి వచ్చింది

గంజాయి సరఫరా అవుతున్నట్టు మా దృష్టికి కూడా వచ్చింది. గంజాయి సరఫరా దారులను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రూట్ వాచ్ కూడా చేస్తున్నాం. జులై లో శివ్వంపేట మండలం నవాపేట్ లో గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశాం.

పద్మ, ఎక్సైజ్​ సీఐ, నర్సాపూర్​