27 కేసులు.. 10 నెలల నుంచి ఎస్కేప్.. పుష్ప-2 సెకండ్ షోకి పోయి అడ్డంగా బుక్కయిన గ్యాంగ్స్టర్..!

నాగ్పూర్: పుష్ప-2 సినిమా గురించి విడుదలకు ముందే కాదు థియేటర్లలో బొమ్మ పడి 20 రోజులవుతున్న తర్వాత కూడా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఈ సినిమా హీరో అల్లు అర్జున్ చుట్టూ నడుస్తున్న గొడవ గురించి పక్కన పెడితే పుష్ప-2 హిందీ బెల్ట్లో కుమ్మేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది.

పది నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న గ్యాంగ్స్టర్ కూడా థియేటర్ కు వచ్చి సినిమా చూసేలా చేసింది. కానీ.. అదే పుష్ప-2 సినిమా వల్ల ఆ గ్యాంగ్స్టర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన నాగ్ పూర్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగ్ పూర్ కు చెందిన విశాల్ మేశ్రం కరుడుగట్టిన గ్యాంగ్స్టర్. రెండు హత్యలు, పోలీసుల పైనే దాడి చేసిన కేసులు ఇతనిపై నమోదయ్యాయి.

Also Read :- ఒక్కటైన పీవీ సింధు, వెంకట దత్త సాయి

పది నెలల నుంచి పోలీసుల కంటపడకుండా తప్పించుకుని తిరుగుతున్న విశాల్ పై 27 కేసులు నమోదయ్యాయంటే ఎంత పెద్ద క్రిమినలో అర్థం చేసుకోవచ్చు. ఇతనిని పట్టుకోవడం కోసం పోలీసులు కొన్ని నెలల నుంచి నిఘా పెట్టారు. అతని కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పుష్ప-2 సినిమా పుణ్యమా అని ఈ క్రిమినల్ పోలీసులకు దొరికేశాడు.

ఎస్యూవీలో ఒక మల్లీప్లెక్స్కు విశాల్ మేశ్రం పుష్ప-2 సినిమా చూసేందుకు సెకండ్ షోకు వెళ్లాడు. పోలీసుల నిఘాలో ఈ విషయం బయటపడింది. థియేటర్ బయట ఉన్న అతని ఎస్ యూవీ టైర్లలో గాలి తీసేశారు. థియేటర్ లోకి ఎంటరై పుష్ప-2 సినిమా ప్రదర్శితం అవుతుండగానే ఈ గ్యాంగ్ స్టర్ ను అరెస్ట్ చేశారు. సినిమా థియేటర్ లో సినిమాటిక్ గా జరిగిన ఈ అరెస్ట్ తో ఆడియెన్స్ నిర్ఘాంతపోయారు.