వర్తమానంలోని అంశాలను ఎంచుకొని కథలు రాసి మెప్పించడం కొందరికే సాధ్యం. ఆ కోవకు చెందిన రచయితే గంగాడి సుధీర్. ఆయన రాసిన ‘ఇగురం’ కథల సంకలనం ఇదే విషయాన్ని చెప్తుంది. ఈ సంకలనంలో మొత్తం 14 కథలు ఉన్నాయి. వీటిలో కొన్ని వివిధ దినపత్రికలు, వెబ్ మ్యాగజైన్లలో పబ్లిష్ అయ్యాయి. కరువు వల్ల పంటలు సరిగా పండక, పని దొరక్క, అప్పుచేసి మరీ గల్ఫ్‌కు వెళ్ళాలనుకున్న రైతు మల్లయ్య.. ఏజెంట్ చేసిన మోసంతో కుటుంబంతో సహా ఊరును విడిచిపెట్టిపోయే దుస్థితిని‘వలసలు’ కథలో చూడొచ్చు. జీవితంపై ఎన్నో ఆశలున్న మధ్యతరగతి యువతి జీవితం అర్ధాంతరంగా ఎలా ముగిసిందో చెప్పే ‘నిశ్శబ్దం’ గుండెను మెలిపెడుతుంది.
బతుకు పోరాటంలో ఒకరి బాధ, మరొకరికి అండగా ఎలా మారిందనేది ‘సమ్మె’లో తెలుసుకోవచ్చు. జీవితంలో అడ్డంకులు ఎదురైనా కావాల్సిన వారికోసం వెనక్కి తగ్గకుండా నిలబడితే వచ్చే ఆనందాన్ని ‘ఓ గెలుపు జ్ఞాపకం’ రుచి చూపిస్తుంది. తరతరాలుగా సమాజంలో ఉన్న కులవివక్షను ఎన్ని రిజర్వేషన్లు అయినా దూరం చేయలేకపోతున్నాయని ‘వివక్ష’ చెప్తుంది. కరోనా టైంలోని కష్టాలను కొంచెం సరదాగా, మరికొంచెం ఆవేదనగా చెప్తాయి ‘లాక్డౌన్’, ‘పోలీస్–రియల్ వారియర్’, ‘ఆకలి రాజ్యం’, ‘కరోనా టైమ్స్’ కథలు. తెలంగాణ మాండలికం కథల్లో గుబాళిస్తుంది. అక్కడక్కడ అక్షర దోషాలు, దారి తప్పిన పుల్‌స్టాప్‌లు, కామాలు అడ్డుతగులుతాయి.
- సాయిప్రేమ్
