Gautam Gambhir: గంభీర్‌పై బీసీసీఐ సీరియస్.. ప్రమాదంలో హెడ్ కోచ్ పదవి

టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చినప్పటి నుంచి భారత్ ఊహించని పరాజయాలు ఎదుర్కొంటుంది. ద్రవిడ్ హెడ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీసీసీఐ గౌతమ్ గంభీర్ ను ప్రధాన కోచ్ గా నియమించింది. అనుభవం లేకోపోయినా బీసీసీఐ గంభీర్ ను గుడ్డిగా నమ్మినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాన కోచ్ గా గంభీర్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అతనికి నచ్చినట సహాయక కోచ్ లను నియమించింది. అయితే మూడు నెలలు గడిచేసరికి గంభీర్ కు అన్ని చేదు అనుభవాలే.

శ్రీలంకపై వన్డే సిరీస్ ను 0-2తో భారత జట్టు కోల్పోయింది. 28 ఏళ్ళ  తర్వాత భారత గడ్డపై లంక సిరీస్ గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఒకరకంగా చెప్పాలంటే శ్రీలంక-బి జట్టుతో ఓడిపోయింది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ 0-3 తేడాతో వైట్ వాష్ అయింది. దీంతో గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ సైతం గంభీర్ పై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. గంభీర్ తన సొంత నిర్ణయాలతో భారత జట్టుపై పనికి రాని ప్రయోగాలు చేస్తున్నాడని.. ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అతనికి చివరిదని వార్తలు వస్తున్నాయి. 

మూడో టెస్టులో టర్నింగ్ పిచ్ కావాలని పట్టు పెట్టాడని.. ఈ విషయంలో బీసీసీఐ అతనిపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తొలి రెండు టెస్టుల్లో పిచ్ పొడిగా ఉన్నప్పటికీ ఇద్దరు పేసర్లతో బరిలోకి దించాలని కోరాడట. ముంబై టెస్టులో నైట్ వాచ్ మెన్ గా సిరాజ్ ను పంపించడం.. సర్ఫరాజ్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో జడేజా కంటే వెనక్కి పంపడం లాంటి ప్రయోగాలు ఫలించలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అనుభవం లేకపోయినప్పటికీ ఆస్ట్రేలియా పర్యటనకు హర్షిత్ రానాను ఎంపిక చేయడం బీసీసీఐకి ఆశ్చర్యానికి కలిగిస్తుందట. రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ గెలవకపోతే గంభీర్ కోచ్ పదవి నుంచి బీసీసీఐ కొనసాగే అవకాశాలు కష్టంగా కనిపిస్తున్నాయి.