రింగ్ రోడ్డు పనులు కంప్లీట్ అయ్యేదెన్నడు?

  • 11 ఏండ్లుగా పెండింగ్ లోనే వర్క్స్
  • గత కాంగ్రెస్  హయాంలో చేపట్టారని బీఆర్ఎస్  సర్కార్  నిర్లక్ష్యం
  • రోడ్డు కోసం సేకరించిన భూమిలో అక్రమ కట్టడాలు

గద్వాల, వెలుగు : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏండ్లుగా గద్వాల ఔటర్  రింగ్  రోడ్డు  పనులు పెండింగ్​లో ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఫండ్స్ రాకపోవటంతో 11 ఏండ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గద్వాల పట్టణంలో ట్రాఫిక్  నియంత్రించేందుకు ఔటర్  రింగ్  రోడ్  చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సర్వే కోసం రూ.15 లక్షలు కేటాయించారు. సర్వే కంప్లీట్  అయ్యాక 2013లో అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వం భూసేకరణకు పచ్చ జెండా ఊపింది.

భూసేకరణ కోసం రూ.4 కోట్లు కేటాయించి, జములమ్మ జీరో పాయింట్  నుంచి గద్వాల, రాయచూర్  రోడ్డు వరకు 6.27 కిలోమీటర్ల మేర 100 ఫీట్ల స్థలాన్ని సేకరించింది. దీంతో 2014లో రోడ్డు నిర్మాణం కోసం రూ.8.76 కోట్ల అంచనాతో టెండర్లను పిలిచింది. కొంత పనులు జరిగిన తరువాత ఫండ్స్  లేకపోవడంతో ఆగిపోయాయి. ఇప్పటివరకు ఆ పనులు పెండింగ్ లోనే ఉండడంతో గద్వాలలో ట్రాఫిక్  కష్టాలు తప్పడం లేదు.

రూ.26 కోట్ల అంచనా..

ఔటర్  రింగ్  రోడ్​ కోసం 6.27 కిలోమీటర్ల రోడ్డును నిర్మించేందుకు అప్పటి గవర్నమెంట్​ ఎస్టిమేషన్లు రెడీ చేసింది. జములమ్మ వరకు చేరాలంటే రైల్వే ట్రాక్  దాటాల్సి ఉంది. రైల్వే ట్రాక్  దాటేందుకు ఆర్వోబీ నిర్మించేందుకు కూడా నిధులు కేటాయించారు. సర్వే కోసం రూ.15 లక్షలు, భూ సేకరణ కోసం రూ.4 కోట్లు, రోడ్డు నిర్మాణం కోసం రూ.8.76 కోట్లు, ఆర్వోబీ కోసం 7.58 కోట్లు, స్ట్రక్చర్స్  నిర్మాణం కోసం రూ.1.12 కోట్లు, ఎలక్ట్రికల్  పోల్స్  కోసం రూ.7 లక్షలతో కలిపి రూ.26 కోట్లతో ఎస్టిమేషన్లు రెడీ చేశారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి.

అక్రమ కట్టడాలు..

గద్వాల, రాయచూర్  మెయిన్  రోడ్​ నుంచి అయిజ మెయిన్  రోడ్​ వరకు పనులు కంప్లీట్  చేశారు. అయిజ రోడ్​ నుంచి జములమ్మ జీరో పాయింట్  వరకు సిల్వర్  కోట్  వేసి వదిలిపెట్టారు. రోడ్డు పనులు చేయని చోట కొంతకాలంగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. జములమ్మ దగ్గర ఏకంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. షెటర్స్​ వేసి కిరాయికి ఇచ్చారు. మళ్లీ పనులు ప్రారంభించాలంటే వీటిని తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సేకరించిన భూమికి హద్దులు లేకపోవడంతో కొందరు ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారు.

ALSO READ : పదేండ్లున్నా ఏనాడూ రైతులను పట్టించుకోలే : అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

బీఆర్ఎస్  హయాంలో నిర్లక్ష్యం..

గత కాంగ్రెస్  హయాంలో పనులు స్టార్ట్  చేశారు. ఎన్నికల ముందు టెండర్లు పిలిచి కొంత పనులు చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్  గవర్నమెంట్  రావడంతో ఔటర్  పనులను నిర్లక్ష్యం చేసింది. ఫండ్స్  కేటాయించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అప్పట్లో రోడ్డు పనులకు టెండర్లు పిలవగా, ఆర్వోబీ నిర్మాణానికి టెండర్లు పిలవాల్సి ఉంది.

బిల్లులు ఇవ్వలే..

ఆర్వోబీ పనులకు రూ.7.58 కోట్లతో అప్పట్లో ఎస్టిమేషన్  వేశారు. దీనికి టెండర్  పిలవకపోగా, అప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్  పనులను ఆపేశారు. ఇప్పుడు రోడ్, ఆర్వోబీ పనులకు టెండర్  పిలవాలంటే, గతంలో కంటే అంచనాలు డబుల్  అయ్యే పరిస్థితి ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇప్పటికే చేసిన పనులకు కాంట్రాక్టర్ కు రూ.కోటికి పైగా బిల్లులు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు.

ఇక ఔటర్  రింగ్  రోడ్డు నిర్మించే ప్రాంతంలో ఉన్న స్ట్రక్చర్స్​కు రూ.1.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ నిర్మాణాలకు ఇప్పటివరకు పరిహారం చెల్లించకపోవడంతో వాటిని తొలగించలేదు. ఈ తరుణంలో ఏడాది కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ పనులను తిరిగి ప్రారంభిస్తుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నివేదిక పంపాం..

ఔటర్  రింగ్  రోడ్  పనులకు ఫండ్స్  లేకపోవడం ఇబ్బందిగా ఉంది. స్ట్రక్చర్స్ కు పరిహారం చెల్లించలేదు. అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని తొలగిస్తాం. ఔటర్  రింగ్  రోడ్  విషయంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఫండ్స్  వస్తే పనులు కంప్లీట్  చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

- ప్రగతి, ఈఈ, ఆర్అండ్ బీ, గద్వాల