గబ్బా టెస్ట్: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్.. 22 పరుగులకే 3 వికెట్లు

బ్రిస్బేన్‎లోని గబ్బా స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‎లో టీమిండియా తడబడుతోంది. ఆసీస్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన పిచ్‎పై భారత టాపార్డర్ కుప్పకూలింది. మూడో రోజు ఫస్ట్ ఇన్సింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్లు ధాటికి 7.2 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టీమిండియాను మొదట్లోనే దెబ్బకొట్టాడు. 

అద్భుత ఫామ్‎లో ఉన్న ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, శుభమన్ గిల్‏ను స్టార్క్ ఔట్ చేసి ఝలక్ ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 3 పరుగులు మాత్రమే చేసి హేజిల్ వుడ్ బౌలింగ్‎లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 7.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసి లంచ్ బ్రేక్‎కు వెళ్లింది. రాహుల్ 13 పరుగులతో క్రీజ్‎లో ఉన్నాడు. స్టార్క్ 2, హేజిల్ వుడ్ ఒక వికెట్ తీశారు. 

అంతకుముందు ఆస్ట్రేలియా 445 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో కదం తొక్కడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‎లో అతిథ్య జట్టు  భారీ స్కోర్ చేసింది. వీరిద్దరూ నాలుగో వికెట్‎కు 241 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పగా.. చివర్లో అలెక్స్ క్యారీ 70 రన్స్ చేసి జట్టును పటిష్ట  స్థితిలో నిలిపాడు. 

మూడో రోజు 405/7 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‎తో ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 40 పరుగులు చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరు వికెట్లతో రాణించగా.. సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఆకాష్ దీప్, నితీష్ రెడ్డికి చెరో వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్‎కు దిగిన భారత్‎కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది.