ఐపీఎల్ ఆదాయం స్వాహా..!: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌పై నెట్టింట ట్రోలింగ్

'ఐపీఎల్ ఆదాయం మింగేస్తున్నాడు..', 'మనం టికెట్లు కొన్న డబ్బే ఆ బొప్పాయి ముక్క..', 'బీసీసీఐ ఆదాయమంతా నోట్లోకి..'.. ఇవీ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాపై నెట్టింట వస్తున్న విమర్శలు. బొప్పాయి ముక్కలు తింటూ కెమెరా కంట పడటమే ఆయన చేసిన పాపం. ఏకంగా తిండిపోతని విమర్శిస్తున్నారు. 

కాన్పూర్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లైవ్ ఆస్వాదించేందుకు స్టేడియానికి వచ్చిన రాజీవ్ శుక్లా బొప్పాయి ముక్కలు తింటూ మ్యాచ్ ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో కెమెరామెన్ ఆయన బొప్పాయి ముక్కలు ఆరగిస్తున్న దృశ్యాలను లైవ్‌లో చూపెట్టాడు. తాను టీవీలో కనిపిస్తున్న విషయాన్ని గ్రహించిన రాజీవ్ శుక్లా కాసేపు ముక్క నమలకుండా మిన్నకుండిపోయారు. అయినప్పటికీ, నెటిజెన్స్ ఆయనను వదల్లేదు. ఆయన తింటున్న దృశ్యాలను స్క్రీన్ షాట్ల రూపంలో నెట్టింట పోస్ట్ చేసి నానా రచ్చ చేస్తున్నారు. ద్వైపాక్షిక సిరీసులు, ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ఆయన తిండికే ఖర్చువుతున్నట్లు విమర్శిస్తున్నారు. ఈ వీడియోను మీరూ ఒకసారి తిలకించండి.