తిరుమలలో పౌర్ణమి గరుడసేవ రద్దు

తిరుమలలో పౌర్ణమి గరుడసేవ రద్దు
30న శ్రీవారి ప్రణయ కలహోత్సవం జరుగుతుండడం వల్లే రద్దు తిరుపతి: ఈనెల 30న  ప్రణయ కలహ మహోత్సవం నిర్వహిస్తున్న కారణంగా తిరుమలలో పౌర్ణమి గరుడసేవను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. బుధవారం పౌర్ణమి సందర్భంగా జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవనుఈ ఉత్సవం కారణంగా రద్దు చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం ఈనెల 30వ తేదీ బుధ‌వారం తిరుమలలో జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామి వారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా బుధవారం పౌర్ణమి సందర్భంగా జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది.