డాక్టర్ చదువుకు ఆర్థికంగా ఆదుకోండి

  • సిద్దిపేట జిల్లాకు చెందిన పేద గిరిజన విద్యార్థి వేడుకోలు

సిద్దిపేట(హుస్నాబాద్), వెలుగు: డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకునేందుకు పేద గిరిజన విద్యార్థిని కష్టపడి చదివి మెడిసిన్ సీటు సాధించింది. రూ. లక్షల్లో కాలేజీ ఫీజులు కట్టాల్సి ఉండడంతో కుటుంబ ఆర్థిక స్థోమత సరిగా లేక ఆర్థికసాయం కోసం దాతలను వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్యా రమేశ్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 

కాగా దంపతులు కూలీ పని చేస్తూ ఇద్దరు బిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె బి ఫార్మసీ ఫైనల్  ఇయర్ చదువుతోంది. చిన్న కూతురు దేవికి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ప్రైవేటు కాలేజీ కావడంతో రూ. లక్షల్లో ఫీజులకు కట్టాల్సి ఉంది. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులతో చదువుకు దూరమయ్యేలా ఉంది. దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా సాయం అందించాలని విద్యార్థిని దేవి వేడుకుంటోంది. మెడిసిన్ విద్యను పూర్తి చేసి పేదలకు సేవ చేస్తానంటోంది.