- మద్యం మత్తులో అదుపు చేయలేకపోయిన డ్రైవర్
- 20 వేల లీటర్ల ఇంధనం నేలపాలు
- సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద ఘటన
- అధికారుల స్పందనతో తప్పిన పెను ప్రమాదం
సికింద్రాబాద్, వెలుగు: వెనుక టైర్ పేలడంతో పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో అదుపుచేయలేకపోయాడు. ట్యాంకర్ నుంచి లీకైన వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ నేలపాలైంది. సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి చౌరస్తా వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు, ఫైర్‌సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ను దారి మళ్లించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
దాదాపు రెండు గంటల పాటు శ్రమించి పెట్రోల్ ట్యాంక్ ను క్రేన్ల సహాయంతో పైకి లేపి అక్కడి నుంచి తరలించారు. చర్లపల్లి భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన పెట్రోల్ట్యాంకర్ సోమవారం ఉదయం చర్లపల్లిలో10 వేల లీటర్ల పెట్రోల్, 10 వేల లీటర్ల డీజిల్ లోడ్‌చేసుకుని సూరారం కాలనీలోని బంక్‌కు వెళుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మెట్టుగూడ ఆలుగడ్డ బావి వద్దకు రాగానే ట్యాంకర్వెనుక టైరు పేలింది.
ట్యాంకర్అదుపు తప్పి ఒక పక్కకు ఒరిగి బోల్తా పడడంతో పై మూతలు తెరుచుకుని ఇంధనం అంతా రోడ్డుపై పారింది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలను దారి మళ్లించి ఫైర్ సిబ్బందిని పిలిపించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు వ్యాపించకుండా ఇంధనంపై ఫోమ్ కొట్టారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్డంతా మట్టి చల్లారు. ట్యాంకర్ వెనుక టైరు పేలినప్పుడు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. దీంతోనే అదుపు చేయలేకపోయాడని చెప్పారు. ఈ ఘటనలో డ్రైవర్ కు గాయలేమీ కాలేదు.