- పండ్లు, కూరగాయలు, నూనెల ద్రవ్యోల్బణం మైనస్‌లలో రికార్డు
- భారీగా పెరిగిన పప్పులు, గుడ్ల ధరలు
- కేంద్ర డేటా ఆధారంగా లెక్కగట్టిన రాష్ట్ర సర్కార్
- పోయినేడుతో పోలిస్తే పల్లీ నూనె రూ.2, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.14 డౌన్
- కేంద్రం ఇటీవల కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో మళ్లీ పెరిగే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు, ఇంధనం ధరలు తగ్గుముఖం పట్టాయా? అంటే మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా.. సర్కార్ లెక్కలు మాత్రం తగ్గినట్టు చెబుతున్నాయి. రిజర్వ్బ్యాంక్ఆఫ్ఇండియా (ఆర్బీఐ) సూచించిన దాని కన్నా తక్కువగా రాష్ట్ర ద్రవ్యోల్బణం నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, ఇంధనం, మసాలాలు, నూనెల ద్రవ్యోల్బణం మైనస్‌లలో రికార్డవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో షేర్చేసిన డేటా ఆధారంగా తెలంగాణ సర్కార్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ వస్తువులు, సేవలపై ద్రవ్యోల్బణాన్ని లెక్కగట్టింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఇంధన ద్రవ్యోల్బణం మైనస్9.9 శాతంగా నమోదైంది.
కూరగాయలు మైనస్ 4.4, వంట నూనెలు మైనస్ 2.7, మసాలా దినుసులు మైనస్1.4, పండ్లు మైనస్ 1.3 శాతంగా నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో హెల్త్ సర్వీసెస్‌లో ద్రవ్యోల్బణం మాత్రం 5 శాతంగా నమోదైంది. పర్సనల్ కేర్ వస్తువులపై 5.5 శాతం మేర నమోదయ్యాయి. అయితే పప్పులు, గుడ్ల ధరలు మాత్రం భారీగా పెరిగినట్టు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పప్పుల ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 19 శాతం, గుడ్ల ద్రవ్యోల్బణం 6.4 శాతంగా రికార్డయింది. రాష్ట్ర సగటు ద్రవ్యోల్బణం మాత్రం ఆర్బీఐ సూచించిన సగటు 4.8 శాతం కన్నా తక్కువగా రికార్డయినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ద్రవ్యోల్బణ రేటు 3.3 శాతంగా ఉన్నట్టు తేలింది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో చదువుల ఖర్చులు భారీగా పెరిగాయి. ఆ ద్రవ్యోల్బణం 8 శాతంగా ఉంది. ప్యాకేజ్డ్మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉంది.
నూనెల ధరలు తగ్గినయ్..
గతేడాదితో పోలిస్తే పలు సరుకుల రేట్లు పెరగ్గా, కొన్నింటి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. పల్లీ నూనె నిరుడు రూ.191 ఉండగా, ప్రస్తుతం రూ.189గా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సన్ఫ్లవర్నూనె ధరలు రూ.152 నుంచి రూ.138కి తగ్గాయి. ఆవనూనె కిలో రూ.156 ఉండగా, ఇప్పుడు దాని ధర రూ.149.5కి తగ్గింది. వనస్పతి ధరలు రూ.130.81 నుంచి రూ.127.43కి పడిపోయాయి. పామాయిల్ధరలు రూ.110 నుంచి రూ.107కి తగ్గాయి. అయితే, ఈ ధరలు కూడా కొద్ది రోజుల్లో పెరిగే అవకాశాలు లేకపోలేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నూనెలపై కేంద్రం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేసింది. ముడి పామాయిల్, సన్ఫ్లవర్ఆయిల్, సోయా ఆయిల్‌పై ఇప్పటి వరకు ఎలాంటి సుంకం లేకపోగా.. ఇప్పుడు ఏకంగా 20 శాతం విధించింది. రిఫైన్డ్ సన్ ఫ్లవర్ఆయిల్, పామాయిల్, సోయా ఆయిల్‌పై ఇప్పటిదాకా 12.5 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉండగా.. దాన్ని 32.5 శాతానికి పెంచింది. పెంచిన సుంకం సెప్టెంబర్నుంచే అమల్లోకి రాగా.. కేంద్రం మాత్రం అంతకుముందు దిగుమతి చేసుకున్న ధరలకు అనుగుణంగానే వంట నూనెల ధరలను మెయింటెయిన్చేయాల్సిందిగా నూనె ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలిచ్చింది. అయితే, ఆ పాత ధరలు ఎన్నాళ్లుంటాయన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. కొత్త సుంకం ఆధారంగా దిగుమతి చేసుకునే నూనెలపై మాత్రం ఒకట్రెండు నెలల్లో ధరల పెరుగుదల కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పప్పుల రేట్లు ఎక్కువైనయ్..
మనం రోజువారీ వాడే పప్పుల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయినట్టు కేంద్రం లెక్కల్లో స్పష్టమవుతున్నది. కిలో కంది పప్పు ధర నిరుటితో పోలిస్తే రూ.25 పెరగడం గమనార్హం. నిరుడు రూ.133 ఉన్న కందిపప్పు.. ఇప్పుడు రూ.158కి ఎగబాకింది. కిలో మినప్పప్పు రూ.114 నుంచి రూ.125కి చేరింది. పెసరపప్పు రూ.110 నుంచి రూ.117కి పెరిగింది. శనగపప్పు రూ.77 నుంచి రూ.88కి చేరింది. గతంలో కిలో బియ్యం ధర రూ.41గా ఉండగా.. ఇప్పుడు రూ.44కి పెరిగింది. గోధుమపిండి రూ.38 నుంచి రూ.39కి పెరిగింది. ఆలుగడ్డల ధరలు రూ.8 పెరిగాయి. కిలో ఆలుగడ్డలు నిరుడు రూ.23 ఉండగా.. ఇప్పుడు రూ.31గా ఉన్నాయి. ఉల్లిగఢ్డల ధర రూ.32 నుంచి రూ.41కి, టమాటలు రూ.43 నుంచి రూ.45కి పెరిగాయి. లీటర్పాలు, కిలో చక్కెరపై ఒక్క రూపాయి పెరగ్గా.. టీ పొడిపై ఒక్క రూపాయి తగ్గింది. ఉప్పు ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.