ముగ్గురు ట్రేడర్లపై నిషేధం విధించిన సెబీ
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్ మానిప్యులేటర్లను కనిపెట్టేందుకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లను సైతం వదిలిపెట్టడం లేదు సెబీ. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులలో అనుమానితులను వేటాడేందుకు ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లను ఇప్పటికే సెబీ వాడుకుంటోంది. తాజాగా ఫ్రంట్ రన్నింగ్ కేసులలోనూ కుటుంబ సభ్యులను గుర్తించి, వారిని బంధుత్వాన్ని లింక్ చేసేందుకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలోని ప్రొఫైల్స్‌నూ సెబీ చెక్ చేస్తోంది. ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఫిడిలిటీ గ్రూప్ ఫ్రంట్ రన్నింగ్ కేసులో ట్రేడర్ వైభవ్ ధడ్డా (అలియాస్ అవి), ఆయన కుటుంబ సభ్యులను గుర్తించడానికి జైన్‌శుభబంధన్‌డాట్‌కామ్ అనే మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ను సెబీ ఉపయోగించుకుంది. ఈ వెబ్‌సైట్లో అల్కా ధడ్డాను తన తల్లిగా వైభవ్ పేర్కొన్నట్లు ఈ నెల 5 నాటి ఇంటరిమ్ ఆర్డరులో సెబీ పేర్కొంది. ఆయన పాస్‌పోర్టు వివరాలలోనూ అల్కా ధడ్డానే తల్లిగా చెప్పుకున్నట్లు సెబీ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాన్ని ధృవీకరించుకోవడానికి సెబీ మ్యాట్రిమోనియల్ వైబ్‌సైట్‌ను ఉపయోగించుకుంది. సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత వైభవ్, ఆయన తల్లి అల్కా, సోదరి ఆరుషిలను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. ఫ్రంట్ రన్నింగ్ కార్యకలాపాల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించడం వల్లే వారిపై వేటు పడింది. అంతేకాదు, అలా అక్రమంగా సంపాదించిన డబ్బు రూ. 1.86 కోట్లను ఏదైనా జాతీయ బ్యాంకులో ఎస్క్రో ఎకౌంట్ ఓపెన్ చేసి, 15 రోజుల్లోగా అందులో జమ చేయాల్సిందిగా వారిని సెబీ ఆదేశించింది. వారికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను స్థంభింప చేసింది.
ఫ్రంట్ రన్నింగ్ అంటే…..
మార్కెట్లోని పెద్ద ప్లేయర్లు ఇచ్చే బై, సెల్ భారీ ఆర్డర్లను ముందుగానే తెలుసుకుని, ట్రేడింగ్ ద్వారా లబ్ది పొందడాన్నే ఫ్రంట్ రన్నింగ్ అంటారు. వైభవ్ విషయానికి వస్తే, ఆయన ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోని ఫిడిలిటీ గ్రూప్ తరఫున ట్రేడర్. సాధారణ పబ్లిక్‌కు తెలియని ఫిడిలిటీ గ్రూప్ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ ఆయనకు అందుబాటులో ఉండేది. ఈ ఇన్ఫర్మేషన్‌ను ఆసరాగా చేసుకుని అల్కా, ఆరుషిలు లాభాలు సంపాదించుకున్నారు. ఫిడిలిటీ గ్రూప్ ఇచ్చే భారీ బై, సెల్ ఆర్డర్లతో షేర్ల ధరలలో వచ్చే మార్పులను వారు అనువుగా మలుచుకుని, ట్రేడింగ్ ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించినట్లు సెబీ పేర్కొంది. ఫిడిలిటీ గ్రూప్ కొనడానికి కొంచెం ముందుగా కొనడం, అలాగే ఫిడిలిటీ గ్రూప్ అమ్మడానికి కంటే కొంచెం ముందుగా అమ్మేయడం అల్కా, ఆరుషిల ట్రేడింగ్ తీరు ద్వారా బయటపడిందని సెబీ తెలిపింది. హాంకాంగ్‌లో పనిచేస్తున్న వైభవ్‌కు కుటుంబ సభ్యుల ట్రేడింగ్ ఎకౌంట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. అల్కా, ఆరుషిల ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీ వల్ల సాధారణ ఇన్వెస్టర్లకు నష్టం కలిగిందని తెలిపింది.
