అస్సాం,బెంగాల్లో తొలిదశ పోలింగ్‌

అస్సాం,బెంగాల్లో తొలిదశ పోలింగ్‌

అస్సాంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మొదటి విడతలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో మజూలి నుంచి అస్సాం సీఎం శర్వానంద సోనోవాల్, జోర్హాట్ నుంచి స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి, పీసీసీ చీఫ్ రిపున్ బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. 47 స్థానాల్లో 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 81 లక్షల 9 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకోసం 11 వేల 537 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా కారణంగా ఓటర్లకు ఒక గంట అధిక సమయాన్ని కేటాయించారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.47 స్థానాల్లో బీజేపీ 39 చోట్ల పోటీ చేస్తుంది. దాని మిత్రపక్షం అస్సాం గణ పరిషత్ పది స్థానాల్లో పోటీ చేస్తుంది.  రెండు స్థానాల్లో బీజేపీ, AGP స్నేహపూర్వకంగా పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ 43 స్థానాలు, దాని కూటమి పార్టీలు AIUDF, CPIML, ఆర్జేడీ, అంచాలిక్ గణ మోర్చా ఒక్కో స్థానాల్లో పోటీకి దిగాయి. ఇక కొత్తగా ఏర్పాటైన అస్సాం జాతీయ పరిషత్ 41 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో కొత్త పార్టీ రాయ్ జోర్ దళ్ 19 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపింది. 

మరోవైపు బెంగాల్ లోనూ మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా బెంగాల్ లోని 30 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా..191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల 288 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. మొత్తం 73 లక్షల ఓటర్లు ఫస్ట్ ఫేజ్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలు పురులియా,బంకురా,జార్గామ్, పూర్వ మిడ్నాపోర్, పశ్చిమ్ మిడ్నాపోర్ జిల్లాల్లో ఉన్నాయి. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 30 స్థానాల్లోని 26 సీట్లను 2016 ఎన్నికల్లో తృణమూల్ గెలుచుకుంది. ప్రస్తుతం 29 స్థానాల్లో తృణమూల్ పోటీ చేస్తుండగా... ఓ చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతునిచ్చింది. కాంగ్రెస్ పది స్థానాలు, దాని మిత్రపక్షాలు లెఫ్ట్ పార్టీ 18 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.