కొత్త ఫోన్ కొని.. ఫ్రెండ్స్ చేతిలో చనిపోయాడు.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్త మొబైల్ ఫోన్ కొని పార్టీ ఇవ్వలేదనే కోపం ఓ యువకుడిని అతడి ఫ్రెండ్సే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతానికి చెందిన సచిన్ (16) అనే యువకుడు నిన్న (సెప్టెంబర్ 23) కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. కొత్త ఫోన్ కొన్న సందర్భంగా పార్టీ ఇవ్వాలని సచిన్‎ను ఫ్రెండ్స్ కోరగా.. ట్రీట్ ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. 

తన దగ్గర డబ్బులు లేవని.. ఇప్పుడు పార్టీ ఇవ్వనని ఫ్రెండ్స్‎కు తేల్చి చెప్పాడు. దీంతో పార్టీ విషయంలో సచిన్‎కు అతడి ఫ్రెండ్స్‎ మధ్య మాట మాటపెరిగి చివరకు ఘర్షణకు దారి తీసింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకులు సచిన్‎ను కత్తితో పొడిచి పరారయ్యారు. గమనించిన స్థానికులు సచిన్‎ను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించించారు. స్నేహితుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సచిన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ విషయంలో గొడవ జరగడంతోనే సచిన్‎పై అతడి స్నేహితులు కత్తి దాడి చేశారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని.. ఘటన స్థలంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.