ఇష్టంగా చదివినప్పుడే లక్ష్యాన్ని చేరుతాం: అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్

ముషీరాబాద్, వెలుగు: ప్రస్తుతం లా కోర్సుకు చాలా డిమాండ్ ఉందని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ చెప్పారు. ఇష్టంగా చదివినప్పుడే లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటామన్నారు. సర్టిఫికెట్ కోసం కాకుండా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచనతో చదవాలని సూచించారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు సందడిగా సాగాయి. 

ముఖ్య అతిథిగా సరోజా వివేక్ పాల్గొని మాట్లాడారు. అన్ని రంగాల్లో రాణించేలా అంబేద్కర్​కాలేజీలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వాటిని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. కాలేజీ సెక్రటరీ, ఎమ్మెల్యే డాక్టర్ వినోద్ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి ఆశయాల కోసం కాలేజీ పనిచేస్తోందన్నారు. విలువలతో కూడిన విద్య అందించడంమే తమ లక్ష్యమని చెప్పారు. డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణు ప్రియ, ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆటపాటలతో స్టూడెంట్లు అదరగొట్టారు.