పేద విద్యార్థులకు ఫ్రీగా షూ అందిస్తా : జనంపల్లి అనిరుధ్​రెడ్డి

జడ్చర్ల, వెలుగు : గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులందరికీ సొంత ఖర్చుతో ఫ్రీగా షూలు అందిస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలోని బాదేపల్లి జడ్పీ బాయ్స్​ హైస్కూల్​లో షూ పంపీణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా తానే స్టూడెంట్ల కాళ్లకు షూ తొడిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లు, కాలేజీల్లో చదవుకుంటున్న 27 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా షూ అందజేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సీఎం చేతులమీదుగా హైదరాబాద్​లో ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల డెవలప్​మెంట్​కు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జడ్చర్ల జడ్పీ బాయ్స్​ హైస్కూల్​అభివృద్దికి హెటిరో కంపెనీ రూ.25 లక్షలు ఖర్చు చేసేందుకు ముందుకురావడం అభినందనీయమని తెలిపారు. ఎంఈవో మంజూలదేవి, మాజీ ఎంపీపీ నిత్యానందం, మాజీ సర్పంచ్​ బుక్క వెంకటేశం, ప్రీతం ఉన్నారు.