ఫ్రీ షీ -షట్లర్ బస్సు ప్రారంభం

  •  త్వరలో అందుబాటులోకి బైక్స్  
  • ఎస్పీ రూపేశ్

సంగారెడ్డి, వెలుగు: ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళల సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత స్పెషల్ బస్సు సౌకర్యం కల్పించారు. న్యూలాండ్ ఫ్యాక్టరీ సహకారంతో రూ.34 లక్షలతో షీ-షట్లర్ బస్సును శుక్రవారం ఎస్పీ రూపేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని ఇండస్ట్రీ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళల భద్రత, సురక్షిత ప్రయాణానికి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఈ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసిందన్నారు. 

ప్రజలు, ఫ్యాక్టరీల భద్రత, ట్రాఫిక్ సమస్య, మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టాలనే ఉద్దేశ్యంతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సంస్థ పోలీసు, ఫార్మా కంపెనీల అనుసంధానంతో నడుస్తుందన్నారు. ఈ బస్సు గాగిల్లాపూర్ నుంచి జిన్నారం రూట్​లో రోజు నడుస్తుందని, ఆ రూట్ లో ప్రయాణించే మహిళలు, స్కూల్ పిల్లలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. 

ఈ బస్సు జీపీఎస్​కి అనుసంధానమై ఉంటుందని దీని ద్వారా షీ సేఫ్​యాప్​ను ఉపయోగించి బస్సు ఏ సమయానికి ఎక్కడ ఉంటుందనే సమాచారం సులువుగా తెలుసుకోవచ్చన్నారు. మహిళలు షీ సేఫ్​యాప్​ను తప్పకుండా డౌన్​లోడ్​చేసుకోవాలన్నారు. ఈ బస్సులో మహిళల భద్రతకు మహిళా పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. 

ఈ ఎస్ఎస్ఎస్ సీ సొసైటీ ద్వారా జిల్లాలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పేరుతో బైక్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ సీ వైస్ చైర్మన్ అడిషనల్​ఎస్పీ సంజీవరావు, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, ఎస్ఎస్ఎస్ సీ మేనేజ్​మెంట్​మెంబర్స్, న్యూ ల్యాండ్ కంపెనీ హెచ్ ఆర్ మేనేజర్ రవి, శారద కంపెనీ సెక్రటరీ అశోక్, రాము, రామకృష్ణ, డీవీ రెడ్డి, శ్రీధర్ నాయక్, భాస్కర్, రఘునాథ్ పాల్గొన్నారు.