ప్రపంచస్థాయి ఆలోచన ఫోర్త్​ సిటీ

మౌలిక  వసతులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలే  మానవ  ఆవాసానికి  నెలవై నాగరికతలకు  పురుడుపోశాయి.  ఆది మానవుడుగా దాదాపు 40 వేల సంవత్సరాలకు ముందు మొదలైన మనిషి ప్రస్థానం నేటి ఆధునిక జీవన సమయానికి ఎన్నో మార్పులకు లోనైంది.  సంచార జీవనం నుంచి నీరు, ఆహారం కోసం క్రమంగా నదులు, నీటి వనరుల చుట్టూ ఆవాసాలను ఏర్పరుచుకొని నాగరికుడుగా మనిషి మారాడని మనకు చరిత్ర చెపుతోంది.

అలా నైలునది కేంద్రంగా ఈజిప్ట్ నాగరికత, చాంగో  నదిని ఆనుకుని చైనా మెసపుటోమియా నాగరికత, మన దేశంలో  సిందూ నది కేంద్రంగా హరప్పా, మెహెంజోదారోల్లోని ఇండస్ వ్యాలీ నాగరికత ఇలా నాటి నుంచి నేటి వరకూ ఎన్నో నగరాలు ఏర్పడుతూ, కనుమరుగౌతూ మనిషికి జీవనాధారమై నేటి రూపాన్ని  సంతరించుకున్నాయి. కృష్ణా ఉపనదిగా ఉన్న మూసీని ఆనుకుని నిర్మితమైన మన భాగ్యనగరం సిగలో ఇప్పుడు మరో అతిగొప్ప నగరం ఫోర్త్ సిటీ రూపంలో రాబోతుంది.  ఒకనాటి గొప్ప నాగరికతా నగరాలతో పాటు నేటి ఆధునిక నగరాల  కోవలో నిలిచి ప్రపంచానికే  చారిత్రక  ఘన వారసత్వాన్ని అందిస్తుంది మన భాగ్యనగరం.

నాగరికతల ఆవిర్భావాలు మన పూర్వీకులు చూసిన అద్భుతాలైతే, ఇంచుమించుగా అర్ధ శతాబ్దం ముందే  మొదలై అతివేగంగా అభివృద్ధి చెందుతున్న అమెరికా సిలికాన్ వ్యాలీ, జపాన్ టోక్యో,  చైనా షాంఘై,  సౌత్ కొరియా సియోల్,  స్విట్జర్లాండ్  జ్యూరిచ్,  దుబాయ్,  సింగపూర్ వంటి  నగరాల  సరసన  మన దేశంలోనూ బెంగళూరు,  చెన్నై,  హైదరాబాద్,  నోయిడా లాంటి  కొన్ని నగరాలే  ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే, ఇందులో చారిత్రకంగా హైదరాబాద్ స్థానం సుస్థిరం.  అభివృద్ధి చెందే  సిటీల కోవలోకి వెళ్లినది మాత్రం నాడు రాజీవ్ గాంధీ హయాంలో దేశంలోకి ప్రవేశించిన ఐటీ రంగం వల్లనే. 

Also Read : మనుగడలో లేని ప్రెస్‌‌‌‌ అకాడమీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌

ఐటీ నగరంగా బహుళ ఖ్యాతి గడించింది. మన నగరం వల్ల  ఇప్పటికే  మన తెలంగాణ యువతకు  కొన్ని అవకాశాలు  అందివచ్చాయి. కానీ,  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకెంతో పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఐటీ రంగంలో రోజురోజుకూ  మారిపోతున్న అధునాతన సాంకేతికతను ఒడిసిపట్టడం, దాంతోపాటు ఇతర  ప్రముఖ రంగాలైన ఫార్మా,  ఆటోమొబైల్,  గేమింగ్,  స్పేస్ సైన్స్,  ఎలక్ట్రానిక్స్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్,  పుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక రంగాల్లో ప్రపంచస్థాయి నగరంగా ముందుకుసాగాలి.
 

ప్రపంచ శ్రేణి నగరంగా ప్యూచర్ సిటీ

ఈ దిశలో మనకు కాంగ్రెస్  ప్రజా ప్రభుత్వం రూపంలో అత్యుత్తమ ఆలోచనలు ఉన్న యంత్రాంగం ఏర్పడింది.  సాక్షాత్తు ముఖ్యమంత్రే  చారిత్రక హైదరాబాద్,  బ్రిటీష్ పాలనలో  సికింద్రాబాద్,  ఐటీ  గ్రోత్​తో సైబరాబాద్ ఏర్పడ్డాయి.  ఇక  ప్రపంచ శ్రేణి  నగరంగా ప్యూచర్ సిటీని నిర్మిస్తామని నిర్దిష్ట కార్యాచరణను ప్రకటించడం, మన హైదరాబాద్​కు  ప్రపంచ పటంలో  సరికొత్త  స్థానం ఏర్పడబోతుందనే నమ్మకాన్ని కలిగించింది. 

ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ప్రాధాన్యక్రమాలను  నిర్దేశించుకొని అమలుచేసిన తీరే వీటికి  సజీవ సాక్ష్యం.  తొలినాళ్లలోనే  వేల కోట్లను సమీకరించి నెరవేర్చిన రెండు లక్షల రైతు రుణమాఫీ వాగ్దానం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం,  రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 10 లక్షల ఆరోగ్య బీమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.  బీఆర్​ఎస్​ పాలన ఖాళీ ఖజానా అప్పజెప్పినా కూడా.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా  తమ హామీలను అమలు చేస్తుండడం ప్రశంసనీయం. 

భారీ స్థాయిలో ఉద్యోగ భర్తీలు

ఇప్పటికే  30వేల ఉద్యోగాలు  భర్తీ  చేయడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, 11వేలకు పైగా మెగా డీఎస్సీ నిర్వహణ,  తొలిసారిగా 563 పోస్టుల గ్రూప్ 1,  గ్రూప్ 2,  స్టాఫ్​నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఇలా అనేక పోస్టుల భర్తీ వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అయితే,  లక్షలాదిగా ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టాలు సాధిస్తున్న తెలంగాణ యువతకు  ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మెరుగైన అవకాశాలు కల్పించడం సవాళ్లతో కూడినది.  దీన్ని సైతం అధిగమించేలా  రేవంత్  ప్రభుత్వం నడుచుకుంటున్నది. 

యువత నైపుణ్యం కోసం స్కిల్​ యూనివర్సిటీ

నైపుణ్యాలు ఉన్న యువత ఎక్కడైనా రాణిస్తారు. అందుకోసం  ప్రస్తుతమున్న  నైపుణ్యలేమిని నిలువరించేలా  యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో ఎంపిక చేసిన విద్యాలయాల్లో పైలట్ స్కిల్ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్ అమలు చేయడం, ఐటీఐలను అప్​గ్రేడ్ చేయడం,  స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటివి అందులో భాగమే. మరో రెండు మూడేండ్లలో  తయారయ్యే  నైపుణ్యవంతమైన యువతకు ఉపాధి కల్పించడం ఎలా?  ఇందుకోసమే రాబోతుంది ఫోర్త్ సిటీ.  సంపూర్ణ మౌలిక వసతులతో ప్రపంచస్థాయి నగరంగా మారబోయే ఈ ప్యూచర్ సిటీ నిర్మాణ ప్రణాళికలను ప్రభుత్వం మన ముందుంచింది.   

ఇటీవల సీఎం, ఐటీ మంత్రి బృందం అమెరికా,  సౌత్ కొరియా పర్యటనల్లో దిగ్గజ  ఫాక్స్ కాన్, కాగ్ని జెంట్,  స్టాన్ ఫోర్డ్  శాటిలైట్ సెంటర్,  వివింట్ ఫార్మా,  కార్నింగ్ కెమిస్ట్రీ,  జోయిటిస్,  హెచ్సీఏ హెల్త్ కేర్ ఇలా అనేక కంపెనీలను తెలంగాణలోని ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. దాదాపు 31,352 కోట్ల పెట్టుబడులతో  నిర్మిత దశలోనే సుమారు 30,750 ఉద్యోగాలను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసి ఉపాధి కల్పనా లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ప్రపంచ స్థాయి రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్సులు

 ప్రపంచస్థాయి రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్సులు వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇలా అన్ని అంశాల్లో సమ్మిళితంగా,  సమగ్రంగా,  సకల శోభాయమానంగా మన కళ్ల ముందే  నాలుగేండ్లలోపే  నవ నాగరికత రూపుదిద్దుకోబోతుంది.  నీళ్లే నాగరికతకు మూలం అన్నట్టు ఫోర్త్ సిటీ నీటి అవసరాలను తీర్చేలా పలు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు, మూసీ పునరుజ్జీవం వంటివి సైతం ఉండబోతున్నాయి.  నేడు సాధించిన ప్రగతిని చూస్తుంటే.. మన ప్రభుత్వ దార్శనికత... సీఎం రేవంత్ రెడ్డి దృఢసంకల్పం ఫలితంగా అతి త్వరలోనే ప్రస్తుత  ప్రపంచాన్ని మించిన నగరాన్ని నాలుగో నగరం  మన తెలంగాణలో చూడబోతున్నాం.  ఈ మహోన్నత సిటీలో అక్షర యోధులకు సైతం స్థానం కల్పిస్తాననడం పట్ల ఒక కలం కార్మికుడుగా సీఎం రేవంత్​కి,  ప్రజా ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఫ్యూచరిస్టిక్ స్టేట్ నినాదంతో  ఫోర్త్ సిటీ.

హైదరాబాద్ తూర్పు దిశలో  ప్రపంచాన్ని దాటి ముందడుగు వేసేలా తెలంగాణ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలోని ప్రతి రాష్ట్రానికి నినాదం ఉన్నట్టుగానే మన రాష్ట్రానికి ఫ్యూచరిస్టిక్ స్టేట్ అనే నినాదంతో ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం కాబోతుంది. దాదాపు14వేల ఎకరాల్లో ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, పర్యాటకం ఇలా నాలుగు జోన్లు ఒక్కోటి దాదాపు 3వేల ఎకరాలతో ప్యూచర్ సిటీలో ప్రత్యేక కారిడార్లుగా రూపొందించారు. అభివృద్ధిని పర్యావరణంతో మిళితం చేసేలా ముచ్చెర్ల ఏరియాలో ఫార్మా రీసెర్చ్ సెంటర్లు రాబోతున్నాయి. 

కందుకూరు వైపు పర్యావరణానికి పెద్దపీట వేస్తూ   పార్కులు,  ఎకో టూరిజం హబ్,  నివాస స్థలాలు వంటివి ఉండబోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. రహదారులు లేకుండా కనెక్టివిటీ సాధ్యం కాదు. ఇందుకోసం ఏకంగా పది వరుసల రహదారిని నిర్మిస్తుండటం, ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ఆర్ఆర్ఆర్ వరకూ 320 ఫీట్లతో 42 కిలోమీటర్ల  గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఏర్పాటు.  ఖర్చు తగ్గేలా రోడ్లకు ఆనుకొనే మెట్రో రైలును సైతం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీఈవో,టిశాట్ నెట్​వర్క్-