వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

  • రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్‌‌‌‌లు
  • వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు

వనపర్తి, వెలుగు : ఆగి ఉన్న లారీని బైక్‌‌‌‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి శివారులో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... చిమనగుంటపల్లికి చెందిన శివ (19), విజయ్‌‌‌‌ (20) ఫ్రెండ్స్‌‌‌‌. ఇద్దరూ సెంట్రింగ్‌‌‌‌ పని చేస్తుంటారు. శివ శనివారం బైక్‌‌‌‌ కొని, ఆదివారం పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మశమ్మ ఆలయం వద్ద పూజ చేయించుకున్నాడు. అనంతరం విజయ్‌‌‌‌తో కలిసి వనపర్తికి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి టైంలో చిమనగుంటపల్లికి వస్తున్నారు.

గ్రామ శివారులోకి రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో శివ, విజయ్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయారు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. శివ తండ్రి చిన్నకుర్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రూరల్‌‌‌‌ ఎస్సై జలంధర్‌‌‌‌రెడ్డి తెలిపారు.

ఫంక్షన్‌‌‌‌కు వెళ్లి వస్తుండగా...

ఆమనగల్లు, వెలుగు : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని టోల్‌‌‌‌ ప్లాజా వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్‌‌‌‌లో ఇద్దరు యువకులు చనిపోయారు. కడ్తాల్‌‌‌‌ మండల కేంద్రానికి చెందిన మహేశ్‌‌‌‌ (24), రాజు ఆదివారం రాత్రి ఆమనగల్లులో జరిగిన ఫంక్షన్‌‌‌‌కు హాజరయ్యారు.

తిరిగి బైక్‌‌‌‌పై కడ్తాల్‌‌‌‌ వస్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు స్పాట్‌‌‌‌లోనే చనిపోయారు. విషయం తెలుసుకున్న సీఐ శివప్రసాద్, ఎస్సై వరప్రసాద్‌‌‌‌ ఘటనాస్థలాన్ని పరిసీలించారు. మృతుడు రాజు సోదరుడు మహేశ్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.