వనపట్ల గ్రామంలో ప్రాణాలు తీస్తున్న పాత మిద్దెలు

  • బాగు చేసుకోడానికి అడ్డుపడుతున్న పేదరికం  
  • బాధితులకు పరిహారం ఇవ్వని గత సర్కారు
  • కూలిన ఇండ్లకు అందని సాయం
  • మూడేండ్లలో 1,800 ఇండ్లు నేలమట్టం

నాగర్​కర్నూల్, వెలుగు: జిల్లాలో శని,ఆదివారాల్లో కురిసిన మామూలు వర్షం వనపట్ల గ్రామంలో నాలుగు  ప్రాణాలను బలి తీసుకుంది. 2022  సెప్టెంబర్, అక్టోబర్​ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి.  కుమ్మెర, రాకొండ, తాడూరు, కొల్లాపూర్​లలో మట్టి మిద్దెలు కూలి ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. నాలుగేండ్లలో దాదాపు 1,800 ఇండ్లు పూర్తిగా, పాక్షికంగా కూలిపోయాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ ఈ కుటుంబాలను ఆదుకోవడానికి గత ప్రభుత్వ పెద్దలకు మనసు రాలేదు. కూలిన ఇండ్ల స్థానంలో రిపేర్లకు డబ్బులిచ్చి ఆదుకోవాలని కోరినా, పరిహారం, సాయం అందలేదు.

అందని సాయం..

మట్టి మిద్దెలు కూలితే రూ.3,202, పక్కా ఇల్లు కూలితే రూ.5,200 ఇచ్చేలా గతంలో తహసీల్దార్లు ప్రతిపాదనలు పంపించారు. ఫండ్స్  లేవన్న సాకుతో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చే ఈ మాత్రం పరిహారం కూడా  ఇవ్వలేదు. 2021లో కుమ్మెర గ్రామంలో  మట్టి మిద్దె కూలిన ఘటనలో హన్మంతరెడ్డి, అనసూయమ్మ, హర్షవర్దన్​రెడ్డి చనిపోతే ఆ కుటుంబానికి నయా పైసా సాయం అందలేదు. రెడ్డి సేవా సంఘం ముందుకు వచ్చి మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించింది. పరామర్శకు వచ్చిన  అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి బాధిత కుటుంబానికి డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని మాటిచ్చారు.

తెల్కపల్లి మండలం రాకొండలో మిద్దెకూలి తల్లీకూతుళ్లు మరణిస్తే ఎటువంటి పరిహారం అందలేదు. తాడూరు మండలంలో గుడిసె కూలి చిన్నారి మృతి చెందిన ఘటనలో ఆ కుటుంబానికి కూడా సర్కారు నుంచి  నయాపైసా రాలేదు. కొల్లాపూర్​లోనూ బాధితులకు ఇదే అనుభవం.   రాష్ట్రం ఏర్పడక ముందే ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రాణ నష్టం జరిగితే, అప్పటి  ప్రభుత్వాలు వెంటనే స్పందించి..  ఆపద్భంధు  కింద చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.50 వేల పరిహారం చెల్లించేవి. తక్షణ సాయం కింద రూ.5 వేలు, ఇందిరమ్మ హౌసింగ్​ స్కీం కింద పక్కా ఇల్లు,  బియ్యం, కిరోసిన్​ ఇచ్చేవారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత బియ్యం లేవు, బట్టలు లేవు. డబుల్​ బెడ్రూం సంగతి అలా ఉంచి ఇండ్లు కూలిన జాగాలోనైనా గుడిసె వేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన డబుల్​ బెడ్రూం ఇండ్లు 622 అయితే కూలిన ఇండ్ల సంఖ్య 1,800 వరకు ఉంటుంది. ఇందులో ఒక్కరికి కూడా బీఆర్ఎస్​ ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద పరిహారం, ఆర్థిక సాయం 
అందించలేదు.  

పిడుగుపడి మృతి చెందినా..

ఈ ఏడాది జిల్లాలో పిడుగుపాటుకు 8 మంది చనిపోతే, ఒక్కరి కుటుంబానికే పరిహారం అందింది. మిగిలిన ఏడు కుటుంబాలు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నాయి.  మృతుల కుటుంబాలకు నేషనల్​ డిజాస్టర్  మేనేజిమెంట్​​ఫండ్స్​ నుంచి రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలతో మనుషులు, పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు చనిపోతే కేంద్రం ఇచ్చే నిధులకు 25 శాతం కలిపి రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంటుంది.

తెలంగాణ వచ్చిన తర్వాత ఆపద్బంధు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. అకాల వర్షాలు, పిడుగులు, వరదల్లో ఆవులు, ఎద్దులు, బర్రెలు, మేకలు, గొర్రెలు చనిపోతే నయాపైసా ఇవ్వకుండా మూడేండ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు. వనపట్ల బాధిత కుటుంబంతో పాటు గడిచిన నాలుగేండ్లలో ప్రాణాలు కోల్పోయిన   కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.