బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మరో ఐదు పతకాలు పండించింది. బాక్సర్లు రెండు బంగారు పతకాలు సాధించగా, పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలోనూ స్వర్ణం వచ్చింది. ట్రిపుల్ జంప్ లో ఒక రజతం, రేస్ వాక్ విభాగంలో ఒక కాంస్యం భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అమిత్ పంఘాల్, నీతు ఘన్ ఘాస్ బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. బాక్సర్ కియారన్ మెక్ డొనాల్డ్ ను అమిత్ పంఘాల్ చిత్తుగా ఓడించాడు. మొదటి రౌండ్ నుంచే మ్యాచ్ పై అమిత్ పట్టు సంపాదించాడు. మొత్తం ఐదుకు ఐదు పాయింట్లను తన ఖాతాలోనే వేసుకున్నాడు. రెండో రౌండ్ ను కూడా 4-1 పాయింట్లతో చేజిక్కించుకున్నాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరిదాకా అమిత్ ఆధిపత్యమే కొనసాగడంతో బంగారు పతకం ఖాయమైంది.
మూడు రౌండ్లలోనూ నీతు ఆధిపత్యం
నీతు ఘన్ ఘాస్.. బాక్సర్ జేడ్ రెస్జాన్ తో తలపడి విజయం సాధించింది. మూడు రౌండ్లలోనూ నీతు స్పష్టమైన ఆధిపత్యం కనిపించింది. దీంతో స్వర్ణ పతకం ఆమెకే చేజిక్కింది. పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో మన దేశానికి చెందిన ఎల్డ్ హోస్ పాల్ 17.03 మీటర్లు దూకి బంగారు పతకాన్ని సాధించగా, అబ్దుల్లా అబూబకర్ 17.02 మీటర్లు దూకి రజత పతకాన్ని పొందారు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ నాలుగో స్థానంలో నిలిచి, కొంచెంలో పతకాన్ని మిస్సయ్యారు. పురుషుల 10 కిలోమీటర్ల రేస్ వాక్ కేటగిరీలో సందీప్ కుమార్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. ఇప్పటి వరకు భారత్ కు మొత్తం 44 మెడల్స్ వచ్చాయి. వీటిలో 15 బంగారు పతకాలు, 11 సిల్వర్స్, 18 రజత పతకాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. 150కి పైగా పతకాలతో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
ఫైనల్లోకి సింధూ..
కామన్వెల్త్ లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం అదరగొడుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధూ ఫైనల్ కి దూసుకెళ్లింది. సింగపూర్ షట్లర్ పై సింధు వరుస సెట్లు నెగ్గింది. జియామిన్ యో పై 21-19,21-17 తేడాతో ఘన విజయం సాధించింది. పదునైన షాట్లతో ప్రత్యర్థిని సింధు ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏ మాత్రం సింగపూర్ షట్లకు ఛాన్స్ ఇవ్వలేదు. గ్రౌండ్ నలువైపులా సింధు ఆడింది. రేపు ఫైనల్లో సింధు తలపడనుంది.
