తుర్కియేలో హెలికాప్టర్ కూలి నలుగురు మృతి

అంకారా: తుర్కియేలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. వైద్య సిబ్బందితో బయలుదేరిన ఓ అంబులెన్స్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌ ఆసుపత్రి బిల్డింగ్‎ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అంతల్యా ప్రావిన్సులో ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు ముగ్లా ట్రైనింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ వైద్య బృందం హెలికాప్టర్‌‌‌‌లో బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, ఓ డాక్టర్, ఓ హెల్త్ కేర్ వర్కర్ అందులో ఉన్నారు. హెలికాప్టర్‌‌‌‌ టేకాఫ్‌‌‌‌ అవుతున్నప్పుడు ఆసుపత్రి నాలుగో అంతస్తును ఢీకొట్టి కుప్పకూలిపోయింది. 

దీంతో అందులోని నలుగురు స్పాట్‎లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని ముగ్లా రీజినల్ గవర్నర్ ఇద్రిస్ అక్బియిక్ తెలిపారు. అధికారులు ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.