పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్‌‌‌‌..నలుగురు మృతి

  •     లారీని ఢీకొట్టిన స్కార్పియో
  •     ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు
  •     గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా వద్ద ప్రమాదం

అలంపూర్, వెలుగు : పెళ్లికి వెళ్లి స్కార్పియోలో తిరిగి వస్తున్న ఓ ఫ్యామిలీ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తా వద్ద నేషనల్‌‌‌‌ హైవే 44పై శుక్రవారం అర్థరాత్రి జరిగింది. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకటేశ్‌‌‌‌ (38), భార్య పుష్ప (35), తల్లి లత (52), కూతురు తరుణి, కుమారుడు నందు, చెల్లెలు కవిత, చెల్లెలి కుమారుడు ఆదిత్య (6) హైదరాబాద్‌‌‌‌లో ఉంటున్నారు.

మే 28న వెంకటేశ్‌‌‌‌ బావమరిది బాలాజీ పెళ్లి ఉండడంతో మూడు రోజుల కింద వీరంతా ఆళ్లగడ్డ వెళ్లారు. పెళ్లి ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి స్కార్పియోలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్‌‌‌‌ హైవే 44పై ఎర్రవల్లి చౌరస్తా వద్దకు రాగానే స్కార్పియో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో స్కార్పియో నడుపుతున్న వెంకటేశ్‌‌‌‌తో పాటు, పుష్ప, లత, ఆదిత్య స్పాట్‌‌‌‌లోనే చనిపోగా, మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని కర్నూలు హాస్పిటల్‌‌‌‌కు, మృతదేహాలను గద్వాల హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇటిక్యాల ఎస్సై వెంకటేశ్‌‌‌‌ తెలిపారు.