ఫార్ములా ఈ కేసు: అరవింద్ కుమార్ ఆదేశాలతోనే రూ.54 కోట్లు బదిలీ: BLN రెడ్డి

ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి బుధవారం (08 జనవరి) BLN రెడ్డిని సుమారు  6 గంటల పాటు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారించింది. అనుమతులు లేకుండా 54 కోట్ల రూపాయలు FEO కి ఎలా బదిలీ చేశారని ఈడీ బృందం ప్రశ్నించింది.  అరవింద్ కుమార్ ఆదేశాలతోనే FEOకి డబ్బులు బదిలీ చేశామని BLN రెడ్డి ఈడీ కి చెప్పారు. తమకున్న పరిధిలోనే డబ్బులను బదిలీ చేశామని పేర్కొన్నారు. పై అధికారి అనుమతి తీసుకొని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు.

మొత్తం చెల్లింపులలో 46 కోట్ల రూపాయలను విదేశీ మారక దవ్యం రూపంలో చెల్లింపులు జరిపినట్లు BLN రెడ్డి ఈడీ బృందానికి తెలిపారు. రెండవ దఫా రేసింగ్ కు ఆటంకం లేకుండా ఉండేందుకే ముందస్తుగా చెల్లింపుల జరిపినట్లు చెప్పారు. రెండవ దఫా రేసింగ్  అడ్వాన్స్ చెల్లించకపోతే రద్దయ్యే అవకాశం ఉండేదని, రేసింగ్ సక్రమంగా నిర్వహించాలని ఉద్దేశంతో డబ్బులు చెల్లించామని తెలిపారు. 

ALSO READ | కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ.. ముగ్గురు లాయర్ల పేర్లు అడిగిన హైకోర్టు

మొదటి ఫేజ్ రేసింగ్ నిర్వహించిన ఏఎస్ నెక్స్ట్ కంపెనీ పార్ట్ నర్షిప్ నుంచి తప్పుకున్నదని, పార్ట్టర్షిపు లేకపోవడంతో హెచ్ఎండిఏ నేరుగా రంగంలోకి దిగి డబ్బులు చెల్లించినట్లు BLN రెడ్డి ఈడీకి వివరించారు. 

గురువారం (9 జనవరి 2025) ఫార్ములా ఈ కేసులో ఏ2 గా ఉన్న అరవింద్ కుమార్ విచారణ జరనుండటంతో BLN రెడ్డి వాంగ్మూలం కీలకంగా మారింది. BLN రెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా అరవింద్ కుమార్ ను విచారించనుంది ఈడీ.