- 8 మందితో ఒక జాబితా విడుదల
- 6 స్థానాలకు మరో నోటిఫికేషన్
- రెండు నోటిఫికేషన్లతో అయోమయం
సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటు అంశం ఊహించని మలుపులు తిరుగుతోంది. మరో మూడు వారాల్లో మల్లన్న కల్యాణోత్సవం సమీపిస్తుండగా కేవలం 8 మంది సభ్యులతో ఆలయ అర్చకుడిని ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఏడాది కాలానికి నియమిస్తూ జీవో 463 జారీ చేశారు. అదేవిధంగా మరో ఆరు స్థానాల కోసం కొత్త దరఖాస్తుల స్వీకరణకు జీవో 464ను విడుదల చేశారు.
కొత్త జాబితాలో సభ్యులుగా చిగిరి కొమురయ్య, కాయిత మోహన్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, అల్లం శ్రీనివాస్, వలాద్రి అంజిరెడ్డి, మామిడాల లక్ష్మి, నేరేల్లపల్లి మహేందర్ రెడ్డి, కొప్పారపు జయప్రకాశ్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్ ఉన్నారు. వీరిలో నుంచి ఒకరికి చైర్మన్బాధ్యతలు అప్పగిస్తారా లేక కొత్త సభ్యులు వచ్చినా తర్వాత చైర్మన్ నియామకం జరుగుతుందా తెలియడం లేదు.
కొత్త దరఖాస్తుల స్వీకరణ
మల్లన్న ఆలయ పాలక మండలి కోసం14 మంది సభ్యుల నియామకానికి గత మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేయగా 72 దరఖాస్తులు వచ్చాయి. వీరి నుంచి 14 మందితో ఏడాది కాలానికి కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలి కానీ 8 మందితోనే ఎందుకు ఏర్పాటు చేశారనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. మరో ఆరు స్థానాలకు కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ జీవో విడుదల చేశారు. కానీ దరఖాస్తులను ఎన్ని రోజుల్లో స్వీకరించాలి, ఎప్పటిలోగా నియమకపు ప్రక్రియను పూర్తి చేయాలనే అంశాలపై స్పష్టత లేదు. మరోవైపు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే 8 మందితో జాబితానే విడుదల చేశారనే చర్చ జరుగుతోంది.
పాలక మండలి ఏర్పాటుపై రాజకీయ ఒత్తిళ్లు..?
కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన ప్రతిపక్ష పార్టీ నేత మరోసారి పాలక మండలిలో స్థానం కోసం ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతూ అధికార పార్టీ నేతలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి పాలక మండలిలో చోటు కోసం తన సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేత, ఓ మంత్రితో అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో సదరు నేతకు అవకాశం ఇవ్వడం ఇష్టంలేని జనగామ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్నేత పార్టీలో చక్రం తిప్పి 8 మందితోనే జాబితా విడుదలయ్యేలా చేశారని అనుకుంటున్నారు.