ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్‌సింగ్ ఆరోగ్యం మరింత విషమించింది.ఈ విషయాన్ని లక్నోలోని సంజయ్‌గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( SGPIMS ) డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు SGPIMS డైరెక్టర్ ఆర్కే ధిమాన్ మధ్యాహ్నం ఒక బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని.. బీపీ లెవల్స్ పడిపోయాయని, యూరిన్ సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కళ్యాణ్ సింగ్ డయాలసిస్‌పైనే ఉన్నారని.. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు ఆయన ఆరోగ్యం ఏ మేరకు మెరుగుపడుతుందో చూడాలని చెప్పారు.
కళ్యాణ్‌సింగ్‌కు గత 72 గంటలుగా డయాలసిస్ జరుగుతోందని.. అదేవిధంగా ఆయన వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారని డాక్టర్ ధిమాన్ తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కళ్యాణ్‌సింగ్ జూన్ 4న లక్నోలోని SGPIMS చేరి చికిత్స పొందుతున్నారు. అంతకుముందు ఆయన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి కళ్యాణ్‌సింగ్‌ను చూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
