మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (92)కన్నుమూశారు. గురువారం(డిసెంబర్ 26) రాత్రి శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం  తిప్పిన మన్మోహన్ సింగ్.. రెండు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయంలో 1991నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో  ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తన వ్యూహచతురతో గాడిన పెట్టారు. ఐదుసార్లు రాజ్య సభ్యుడిగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. 1987లో భారత ప్రతిష్టాత్మక అవార్డు పద్మ విభూషన్ అందుకున్నారు.  

మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.  ఆర్థికవేత్తగా ఎంతో మందిని ప్రభావితం చేశారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్ కూడా మంత్రి అయిన తర్వాత మొదటిసారి మన్మోహన్ సింగ్ ను కలిసి ఆయననుంచి సలహాలు తీసుకున్నారు.