ఇయ్యాల (డిసెంబర్ 28న) నిగమ్​బోధ్​లో అంత్యక్రియలు

  • 8 గంటలకు ఏఐసీసీ హెడ్  క్వార్టర్​కు మన్మోహన్ పార్థివ దేహం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఆయన పార్థివ దేహాన్ని గురువారం అర్ధరాత్రి దాటాక ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి నేరుగా ఢిల్లీలోని మోతిలాల్ నెహ్రూ రోడ్ లో ఉన్న ఆయన ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలు పార్టీల ప్రముఖులు మన్మోహన్ ఇంటికెళ్లి నివాళులర్పించారు. ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

శనివారం ఉదయం 8 గంటలకు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఏఐసీసీ హెడ్ క్వార్టర్​కు తరలిస్తారు. అక్కడ 8.30 నుంచి 9.30 వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత 9.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది.  11.45 గంటలకు నిగమ్​బోధ్ ఘాట్​లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.

సైనిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో పని చేస్తున్న అన్ని కార్యాలయాలకు శనివారం హాఫ్ డే సెలవు ప్రకటించారు. 2025, జనవరి 1 వరకు 7 రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా పాటించాలని కేంద్రం సూచించింది. వారం రోజుల పాటు దేశంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసులు, విదేశాల్లో ఉన్న హై కమిషన్ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేస్తారు. కాగా, కాంగ్రెస్‌‌‌‌ పార్టీ వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నది.

అమెరికా నుంచి వచ్చిన కూతురు

మన్మోహన్ సింగ్​కు ముగ్గురు కుమార్తెలు ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దామన్ సింగ్ ఉన్నారు. వీళ్లంతా ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుకుని వారి వారి కెరీర్లలో అద్భుత విజయాలు సాధించారు. వీరిలో ఓ కూతురు అమెరికాలో స్థిరపడింది. తండ్రి చనిపోయారన్న వార్త తెలుసుకుని ఫ్యామిలీతో ఇండియాకు బయల్దేరింది. వర్షాల కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

దీంతో శుక్రవారం రాత్రి ఆమె ఢిల్లీలోని ఇంటికి చేరుకున్నారు. తండ్రి పార్థివ దేహాన్ని చూసి ఆమె బోరున విలపించారు. కూతురి కోసమే అంత్యక్రియలను శనివారానికి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.