ఆర్థిక సూర్యుడికి అశ్రునివాళి.. ఉదయం11.45కు నిగమ్​బోధ్ ఘాట్​లో అంత్యక్రియలు

  • మన్మోహన్ సింగ్ యాదిలో యావత్ దేశం
  • ప్రపంచ దేశాల్లోనూ నేతల సంతాపాలు
  • ఢిల్లీలోని నివాసంలో పార్థివదేహం వద్ద రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు
  • మన్మోహన్ కుటుంబాన్ని ఓదార్చిన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక 
  • నేడు ఉదయం 9.30కు ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్​క్వార్టర్స్ నుంచి అంతిమయాత్ర
  • ఉదయం11.45కు నిగమ్​బోధ్ ఘాట్​లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 
  • దేశం మహోన్నత నేతను కోల్పోయింది: కేంద్ర కేబినెట్
  • జనవరి 1 వరకు సంతాప దినాలు.. దేశవ్యాప్తంగా జాతీయ జెండాల అవనతం

న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలతో భారతదేశ గమనాన్ని మార్చిన, రాజకీయాల్లో హుందాతనానికి మారుపేరుగా నిలిచిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్​కు యావత్ దేశం అశ్రు నివాళులర్పించింది. భారత ఎకానమీకి వెలుగులు అద్దిన ఆ ఆర్థిక సూర్యుడ్ని యాది జేసుకుంది. ప్రపంచ దేశాధినేతలు కూడా మన్మోహన్​తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. మౌనంగానే మహోన్నతంగా ఇండియాను అగ్రదేశాల సరసన నిలిపారని వారు కొనియాడారు. మన్మోహన్ సింగ్​ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పిం చారు. మన్మోహన్ సింగ్ (92) వృద్ధాప్య సంబంధ సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్​లో కన్నుమూశారు. త్రివర్ణ పతాకం కప్పిన ఆయన పార్థివ దేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో ప్రముఖుల సందర్శనకు ఉంచారు.

మన్మోహన్ పార్థివదేహాన్ని శనివారం ఉదయం ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్​కు తరలిస్తారు. ఉదయం 9.30 గంటలకు ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ఉదయం 11.45 గంటలకు ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.  

రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు.. 

మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ఆయన నివాసంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కేసీ వేణుగోపాల్ సహా ఇతర సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, సిద్ధరామయ్య, ఎంకే స్టాలిన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

దేశం మహోన్నత నేతను కోల్పోయింది: కేంద్ర కేబినెట్ 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడని కేంద్ర కేబినెట్ కొనియాడింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా మంత్రివర్గ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మన్మోహన్ స్మారకార్థం సంతాప తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది. ఆయన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలి యజేసింది. కాగా, మన్మోహన్ సింగ్​కు నివాళిగా జనవరి 1 వరకూ ఏడు రోజులను సంతాప దినాలుగా కేబినెట్ ప్రకటించింది. ఈ ఏడు రోజుల పాటు ప్రభుత్వ భవనాలపై, వివిధ దేశాల్లోని ఇండియన్ ఎంబసీలు, హైకమిషన్ లపై జాతీయ జెండాను అవనతం చేసి ఉంచాలని వెల్లడించింది. మాజీ ప్రధానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని, ఆ రోజు ప్రభుత్వ ఆఫీసులకు హాఫ్ డే సెలవును ఇస్తున్నట్టు కేబినెట్ తెలిపింది. 

ఆర్థిక మంత్రిగా చెరగని ముద్ర: మోదీ 

మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా నివాళులు అర్పించారు. దేశంలోని అతి విశిష్ట నాయకుల్లో మన్మోహన్ ఒకరు అని కొనియాడుతూ మోదీ ట్వీట్ చేశారు. ‘‘మన్మోహన్ జీ ప్రధానిగా ఉన్నప్పుడు నేను గుజరాత్ సీఎంగా ఉన్నా. అప్పుడు తరచూ ఆయనను కలిసేవాడిని. పరిపాలనకు సంబంధించిన ఎన్నో అంశాలపై ఆయనతో చర్చించేవాడిని. ఆయన తెలివితేటలు, హుందాతనం ఎల్లప్పుడూ కొట్టొచ్చినట్టు కనిపించేవి. ఈ బాధాకరమైన సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులు, లెక్కలేనంత మంది అభిమానుల చుట్టే నా ఆలోచనలు ఉన్నాయి. ఓం శాంతి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన నేత: పారిశ్రామికవేత్తలు  

ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చి, ప్రపంచానికి ద్వారాలు తెరిచిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని, ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కొనియాడారు. బిలియనీర్లు గౌతమ్ అదానీ, చంద్రశేఖరన్, కుమార మంగళం బిర్లా, సునీల్ మిట్టల్, అనిల్ అంబానీ, హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, కిరణ్ మజుందార్ షా, ఇతర పారి శ్రామికవేత్తలు, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి, మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. 

దేశ తలరాతను మార్చిన నాయకుడు: సీడబ్ల్యూసీ 

దేశ తలరాతను మార్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కొనియాడింది. శుక్రవారం ఢిల్లీలో భేటీ అయిన సీడబ్ల్యూసీ ఈ మేరకు సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. ఆర్థిక సంస్కరణలతో దేశ ఎకానమీని పరుగులు పెట్టించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం పొందారని పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో ఎననో సవాళ్లను ఎదుర్కొని ఆయన దేశాన్ని గాడిన పెట్టారని ప్రశంసించింది. మన్మోహన్ సింగ్ భావి తరాలకు ఒక మార్గదర్శిలా నిలిచారని, తామంతా ఆయన మార్గంలోనే ముందుకు వెళ్తామని తీర్మానం చేసింది.

అన్ని రాష్ట్రాల్లోనూ 7 రోజులు సంతాప దినాలు

మన్మోహన్ సింగ్​కు నివాళులు అర్పిస్తూ తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల ప్రభు త్వాలు కూడా డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించాయి. ఈ ఏడు రోజుల పాటు అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవనతం చేసి ఉంచనున్నారు. అలాగే, అన్ని రాష్ట్రాల్లో అధికారిక వేడుకలు, వినోద కార్యక్రమాలను రద్దు చేశారు. కాగా, రాష్ట్రపతి భవన్ వద్ద ప్రతి వారం నిర్వహించే చేంజ్ ఆఫ్ గార్డ్ సెరెమొనీ(ప్రెసిడెంట్ బాడీగార్డుల మార్పుకు సంబంధించిన మిలిటరీ సంప్రదాయ కార్యక్రమం)ని శనివారం రద్దు చేసినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్ గౌరవార్థం 7 రోజులు సంతాప దినాలు పాటిస్తున్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు తెలిపాయి.    

ఎన్నో ప్రశ్నలకు నా మౌనమే సమాధానం

నేను.. నా వ్యక్తిత్వం.. తెరిచిన పుస్తకం

ఒక వ్యక్తికి టైమ్ వచ్చిందంటే.. అతడి ఐడియాను ఆపే శక్తి ఈ భూమి మీద దేనికీ లేదు. ఈ ఐడియా (ఆర్థిక సంస్కరణలు) దేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెడుతుంది. (1991 బడ్జెట్ స్పీచ్​లో మన్మోహన్ సింగ్)

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా ఖ్యాతి పొందారు. ప్రభుత్వంలో అనేక కీలక పదవులను సమర్థంగా నిర్వర్తించారు. ఆర్థిక మంత్రిగా ఆయన అమలు చేసిన పాలసీలు చెరగని ముద్రను వేశాయి. ఆయన ప్రసంగాలు ఎందరికో స్ఫూర్తిదాయకం. దేశ ప్రజల జీవితాలు మెరుగు పరిచేందుకు ప్రధాన మంత్రిగా ఎనలేని కృషి చేశారు. (ప్రధాని నరేంద్ర మోదీ)

మిత్రుడిని, ఫిలాసఫర్​ను, గైడ్​ను కోల్పోయా. వ్యక్తిగతంగా మన్మోహన్​ సౌమ్యుడే అయినప్పటికీ, తన నిర్ణయాలకు సంబంధించి చాలా దృఢ నిశ్చయంతో ఉండేవారు. సోషల్ జస్టిస్, సెక్యులరిజం, ప్రజాస్వామ్య విలువలపై నిబద్ధతతో ఉండేవారు. మన్మోహన్​తో మాట్లాడటం అంటే జ్ఞానాన్ని పొందడమే. ఆయన నిజాయతీ, వినయం అందరికీ ఆదర్శం. (సోనియాగాంధీ)

మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. ఆయన చేసిన సేవలు అపారమైనవి. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మన్మోహన్ సింగ్  నవభారత రూపశిల్పి.. లెజెండ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. (సీఎం రేవంత్​ రెడ్డి)