సీఎం బర్త్ డే వేడుకలు చేస్తే తప్పా

  • హరీశ్ రావు పై హన్మంతరావు ఫైర్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటలో సీఎం బర్త్​డే వేడుకలు చేస్తే హరీశ్ రావు జీర్ణించుకోలేకపోయాడని, తన అనుచరులతో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేపించారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. శనివారం సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా తాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా గడిపానని, సంబరాల్లో భాగంగా సిద్దిపేటలోని 37వ వార్డులో దళిత కౌన్సిలర్ సాకి బాలలక్ష్మీ ఆనంద్ తో కలసి దుస్తుల పంపిణీ ప్రోగ్రాం లో పాల్గొనగా, అది ఓర్వలేని హరీశ్ రావు తన అనుచరులతో సీఎంకు, తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారన్నారు. 

ఆయన  ఇంకా అధికారంలో ఉన్నాం అనే భ్రమలో ఉన్నారని, తాము అనుకుంటే అక్కడ పరిస్థితి వేరే ఉండేదన్నారు. వాళ్ల కుటుంబం అధికారంలో ఉండగా రూ.7లక్షల కోట్లు సంపాదించిందని ఆ డబ్బుతో తెలంగాణ అప్పు ను తీర్చవచ్చన్నారు.  హరీశ్ రావు చుట్టూ ల్యాండ్ మాఫియా ఉందని, వాళ్ల కబ్జాలు, అరాచకాలు అన్ని బయటకు తీసే దాకా కల్వకుంట్ల ఫ్యామిలీని వదలమన్నారు. తన కొడుకు జనం తోడు ఉన్న వాడని, అతడితో పెట్టుకుంటే హరీశ్ రావు తట్టుకోలేడన్నారు. ఆయనతో ఛాలెంజ్ చేసి కష్ట పడి ఎమ్మెల్యే గా గెలిచాడన్నారు. 

హరీశ్ రావు గతంలో పోలీసులను, అధికారులను తన్నినా తప్పు కానిది, ఇప్పుడు సీఎం వేడుకల్లో ఒక పోలీస్ అధికారి కేక్ తింటే తప్పు ఎలా అవుతుందన్నారు.  శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ ట్రోఫీ ఓపెనింగ్ సందర్భంగా తాను క్రికెట్ ఆడుతూ స్లిప్ అయి పడ్డానని దానిని కూడా హరీశ్ రావు అనుచరులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తాడూరి శ్రీనివాస్ గౌడ్, అత్తు ఇమామ్, గాడిపల్లి శ్రీనివాస్ రెడ్డి, బొమ్మల యాదగిరి, కలీమొద్దిన్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, సదాశివ రెడ్డి, అజ్జూ యాదవ్, అంజి రెడ్డి పాల్గొన్నారు.