లక్నో/గోరఖ్‌పూర్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి, మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ.. సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. వీరితోపాటు బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఐదుగురు ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రిజేశ్ ప్రజాపతి, ముకేశ్ వర్మ, వినయ్ షక్య, భగవతి సాగర్, బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్‌కు చెందిన చౌధరి అమర్ సింగ్ కూడా శుక్రవారం లక్నోలో ఎస్పీ చీఫ్అఖిలేశ్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి 80 శాతం సీట్లు, బీజేపీకి 20 శాతం సీట్లు వస్తాయని యోగి ఆదిత్యనాథ్ అనుకుంటున్నారేమో. కానీ స్వామి ప్రసాద్ మౌర్య, ఇతర నేతలు ఎస్పీలోకి వచ్చాక.. ఆ 20 శాతం సీట్లు కూడా బీజేపీకి రావు. ముఖ్యమంత్రి ఓ లెక్కల టీచర్‌ను పెట్టుకోవడం బెటర్” అంటూ అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. 80 శాతం మంది ఓటర్లు ఒకవైపు, 20 శాతం మంది ( ముస్లిం జనాభాను పరోక్షంగా ఉద్దేశిస్తూ) ఓటర్లు ఇంకో వైపు ఉంటారని యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కామెంట్ చేశారు. దీనికి అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి 3/4 వంతుల సీట్లు కాదని.. మూడో, నాలుగో వస్తాయన్నారు. కాగా, బీజేపీ ఫిరాయింపు నేతల చేరికల సందర్భంగా లక్నోలోని ఎస్పీ ఆఫీసు వద్ద నిర్వహించిన ‘వర్చువల్ సభ’ వివాదాస్పదమైంది. వందలాది మంది కార్యకర్తలు రావడంతో పోలీసులు అందరినీ వెనక్కి పంపారు.
