పాలమూరు ల్యాండ్ స్కాంలో.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్

  •  సర్వే నంబర్‌‌‌‌ 523లోని ప్రభుత్వ భూమిని అమ్ముకున్న గులాబీ నేతలు
  • ఫేక్‌‌‌‌ ఇండ్ల పట్టాలు, స్టాంపులు తయారు చేసి దందా
  • గతంలోనే ఇండ్లను కూల్చివేసిన ఆఫీసర్లు
  • ఆగస్ట్‌‌‌‌లో ముగ్గురిని అరెస్ట్‌‌‌‌ చేసిన పోలీసులు
  • తాజాగా పోలీసులకు లొంగిపోయిన మాజీమంత్రి శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ తమ్ముడు శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌‌‌‌పల్లి వద్ద గల సర్వే నంబర్‌‌‌‌ 523లో జరిగిన ల్యాండ్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి ఫేక్‌‌‌‌ పట్టాలు, స్టాంప్‌‌‌‌లు తయారుచేసి అమ్మేశారు. విచారణ చేపట్టిన ఆఫీసర్లు పట్టాలన్నీ ఫేక్‌‌‌‌ అని గుర్తించడంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌‌‌‌ చేయగా.. తాజాగా మాజీమంత్రి శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ తమ్ముడు శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ పోలీసులకు లొంగిపోయాడు

ఫేక్‌‌‌‌ పట్టాలు సృష్టించి అక్రమాలు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని సర్వే నంబర్‌‌‌‌ 523లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 96.28 ఎకరాల భూమి ఉంది. ఇందులో 83.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. 16 ఎకరాలను డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లకు కేటాయించారు. ఖాళీగా ఉన్న ప్లేస్‌‌‌‌లో కొంత భూమిని 75 మంది దివ్యాంగులకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఆయా వర్గాల శ్మశానవాటికల కోసం 4 ఎకరాలు, పలు కుల సంఘాల కోసం మరికొంత స్థలం కేటాయించడంతో సుమారు 50 ఎకరాల భూమి మిగిలి ఉంది. ఈ స్థలం జిల్లా కేంద్రంలో ఉండడం, ఈ భూముల సమీపం నుంచే భారత్‌‌‌‌ మాల నేషనల్‌‌‌‌ హైవే నిర్మాణానికి ప్లాన్‌‌‌‌ ఖరారు కావడంతో ఎకరం భూమి రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో ఈ భూమిపై కొందరు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు కన్నేశారు. ఫేక్‌‌‌‌ ఇండ్ల పట్టాలు, నకిలీ స్టాంప్‌‌‌‌లు సృష్టించి, 100 గజాల నుంచి మొదలుకొని 120, 150, 200 గజాల చొప్పున ప్లాట్లుగా మార్చి ప్రజలకు అమ్మేశారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్నారు. ఈ దందాను దాదాపు ఐదేండ్ల పాటు నిర్వహించారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో 2021లో అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు కొన్ని ఇండ్లను కూల్చేశారు. అయితే ప్లాట్లు తీసుకున్న వారు కూల్చి ఇండ్ల వద్దే మళ్లీ తాత్కాలిక షెడ్లు నిర్మించుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ ఆఫీసర్లు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. స్పందించిన ఆఫీసర్లు విచారణకు ఆదేశించారు. రెండు టీమ్‌‌‌‌లుగా ఏర్పడిన రెవెన్యూ ఆఫీసర్లు ఆగస్ట్‌‌‌‌లో సర్వే నంబర్‌‌‌‌ 523లో విచారణ చేపట్టారు. ప్రజల వద్ద ఉన్నవి నకిలీ పట్టాలని, మరికొందరి వద్ద అసలు పట్టాలే లేవని తేల్చారు. దీంతో ఆగస్టు 29న రెవెన్యూ, మున్సిపల్‌‌‌‌ ఆఫీసర్లు దాదాపు 70 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.

మాజీ మంత్రి తమ్ముడు శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌పై ఆరోపణ

ఫేక్‌‌‌‌ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూమిని అమ్మేశారని గుర్తించిన రెవెన్యూ సిబ్బంది గత నెలలో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు పట్టాలు పొందిన వారిని ప్రశ్నించారు. రాయుడు, దేవా అనే ఇద్దరు వ్యక్తులు తమ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకొని ఈ పట్టాలు ఇచ్చారని బాధితులు చెప్పారు. దీంతో రాయుడు, దేవాను గత నెల 12న అరెస్ట్‌‌‌‌ చేశారు. వీరిని విచారించగా.. ఫేక్‌‌‌‌ పట్టాలు సృష్టించి, ప్రభుత్వ భూముల అమ్మకానికి ఓ కౌన్సిలర్‌‌‌‌ భర్త రాజు, మాజీమంత్రి వి.శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ తమ్ముడు శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ సహకరించారని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏ1గా రాయుడు, ఏ2గా దేవా, ఏ3గా రాజు, ఏ4గా శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ పేర్లను చేర్చారు. రాయుడు, దేవాతో పాటు రాజును గతంలోనే అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ పరారీలో ఉండడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ తనకు తానుగా లొంగిపోయాడు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌, వెలుగు : సర్వే నంబర్‌‌‌‌ 523లోని ప్రభుత్వ భూమికి ఫేక్‌‌‌‌ పట్టాలు సృష్టించి అమ్ముకున్న కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ శుక్రవారం సాయంత్రం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో లొంగిపోయాడని సీఐ గాంధీ నాయక్‌‌‌‌ చెప్పారు.  శ్రీకాంత్‌‌‌‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ తీసుకొచ్చి అప్పగించారన్నారు. లీగల్‌‌‌‌ ఫార్మాలిటీస్‌‌‌‌ పూర్తి అయిన అనంతరం శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌‌‌‌కు తరలిస్తామని చెప్పారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, విచారణ స్వచ్ఛాయుత వాతావరణంలోనే జరుపుతున్నామన్నారు.