పార్టీ మార్పుపై మాజీ మంత్రి రోజా కీలక ప్రకటన

అమరావతి: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రోజా పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే ఆమె ఓ తమిళ పార్టీలో తీర్థం పుచ్చుకోబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పుపై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీ మారడం లేదని.. జగన్ అన్నాతోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని విడిచి వెళ్తున్న వారు ఒకసారి పునరాలోచన చేసుకోవాలని హితవు పలికారు. ఆపత్కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరని హెచ్చరించారు. 

Also Read :- YS జగన్‎కు హైడ్రా నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపైన రోజా స్పందించారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని ప్రభుత్వంపై మండిపడ్డారు. అమ్మాయిల హాస్టల్ బాత్ రూముల్లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రహస్య వీడియోలు చిత్రీకరించారని విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళన చేస్తోంటే గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరగలేదని ఎస్పీ అనడం దురదృష్టకరమని అన్నారు.