జిల్లాలు రద్దు చేస్తే ఊరుకోం : నిరంజన్​రెడ్డి

వనపర్తి, వెలుగు: కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. శుక్రవారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలు పోతాయంటే మంత్రి కృష్ణారావు, చిన్నారెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి జిల్లాల రద్దుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ పార్టీకి ఓటేయడమంటే ప్రజలు జిల్లాల రద్దుకు ఎండార్స్​మెంట్​ ఇచ్చినట్లేనని పేర్కొన్నారు. నాగర్​కర్నూల్​ ఎంపీగా ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ను గెలిపించాలని కోరారు. గట్టుయాదవ్, రఘుపతిరెడ్డి, నందిమల్ల అశోక్, లక్ష్మారెడ్డి, మన్నెపు రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్​ కుట్రను తిప్పికొట్టాలి

నారాయణపేట: నారాయణపేట జిల్లాను తీసేసే కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత జిల్లా ప్రజలపై ఉందని బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి అన్నారు. ఈ విషయంపై సీఎం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. శుక్రవారం పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాలను రద్దు చేయాలని ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. విజయ్​సాగర్, వేపూరి రాములు, భీమయ్య, చెన్నారెడ్డి ఉన్నారు.

నాగర్ కర్నూల్: జిల్లాలను కుదిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని బీఆర్ఎస్​ ఎంపీ క్యాండిడేట్​ ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్  హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ 33 జిల్లాలను కుదించి 15 జిల్లాలు చేయాలని ప్రయత్నిస్తే ఊరుకోమన్నారు. జిల్లాలను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయని, నాలుగు జిల్లాలుగా ఉన్న ఉమ్మడి పాలమూరు రెండు జిల్లాలుగా మారే ప్రమాదం ఉందన్నారు.

మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి బీజేపీ అయోధ్య రాముడిని వాడుకుంటుందని విమర్శించారు. కేంద్రంలో 400 ఎంపీ స్థానాలు సాధిస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లను తొలగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేకమంది అమ్మాయిలను వేధించి అత్యాచారాలకు పాల్పడిన  కర్నాటక సిట్టింగ్  ఎంపీ ప్రజ్వల్‌‌‌‌‌‌‌‌ రేవణ్ణ వంటి రేపిస్టుకు మద్దతుగా మోదీ  ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.