కేసీఆర్‌‌ కీర్తిని ఎవరూ తుడిచిపెట్టలేరు : మాజీమంత్రి హరీశ్‌‌రావు

  • కొందరు దొంగలు పార్టీలోకి వచ్చి పందికొక్కుల్లా తినిపోయిన్రు
  • బయటకు వెళ్లిన వారిని మళ్లీ పార్టీలో చేర్చుకోం

సిద్దిపేట, వెలుగు : ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌‌ కీర్తి ప్రతిష్టలను ఎవరూ తుడిచిపెట్టలేరని, తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్‌‌ పేరు ఉంటుందని మాజీమంత్రి హరీశ్‌‌రావు చెప్పారు. దీక్షా దివస్‌‌ సందర్భంగా శుక్రవారం సిద్దిపేట బీఆర్‌‌ఎస్‌‌ ఆఫీస్‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కొందరు దొంగలు పార్టీలోకి వచ్చి పందికొక్కుల్లా తిని పోయారు, వారిని తిరిగి పార్టీలో చేర్చుకోబోం’ అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా రాజీనామా చేయని వ్యక్తి రేవంత్‌‌రెడ్డేనని, ఆయన ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడా ? అమరులకు ఒక్క పువ్వు అయినా పెట్టాడా ? అని ప్రశ్నించారు. 

కేసీఆర్‌‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్‌‌రెడ్డి అంటున్నారని.. నవంబర్ 29న అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్‌‌ను అరెస్ట్‌‌ చేసిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా ? డిసెంబర్ 9 నాటి రాష్ట్ర ప్రకటన ఆనవాళ్లు లేకుండా చేస్తావా ?  అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులది ఎంత గొప్ప పాత్రనో.. తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులదీ అంతే గొప్ప పాత్ర అని కొనియాడారు.

 అంతకుముందు ప్రశాంత్‌‌నగర్‌‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి, రంగధాంపల్లి వద్ద అమరవీరుల స్థూపానికి హరీశ్‌‌రావు నివాళి అర్పించారు. అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌‌ను ప్రారంభించారు. దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య నేతలతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.