‘పొడుస్తున్న పొద్దు మీద’ పాట వింటే రోమాలు నిక్కపొడిచేవి: హరీష్ రావు

సిద్దిపేట: ప్రజా యుద్ధనౌక గద్దర్ డాక్యుమెంట్ రూపొందిస్తే నేను సహాయం చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో ఆదివారం (డిసెంబర్ 15) గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక పుస్తకం రూపంలో తీసుకరాలేకపోయామని అన్నారు. గద్దర్ అర్థ శతాబ్దపు పోరాట స్ఫూర్తిని ఆయన కొడుకు ఒక పుస్తకం రూపంలో తెచ్చారని.. ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి పుస్తకం తీసుకురావడం శుభపరిణామమన్నారు.

గద్దర్ అన్న ఎన్నో బతుకమ్మ పాటలను అందించారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. ఇలా అన్ని  పోరాటాల్లో గద్దర్ పాల్గొన్నారని.. ఆయన పాట వంద ఉపన్యాసాలకు సమానమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అన్న పాటలు మరింత ప్రత్యేకమని.. ఆయన పాటలు ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తి రగిల్చాయన్నారు. మలిదశ ఉద్యమం సమయంలో పొడుస్తున్న పొద్దు మీద పాట వింటే రోమాలు నిక్క పొడిచేవి అని గుర్తు చేసుకున్నారు. 

తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన అభ్యర్థుల మీద పోటీ పెట్టవద్దని గద్దర్ మమ్మల్ని కోరారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అండగా నిలబడ్డారని అన్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెరగడానికి గద్దర్ అన్న ప్రతిపాదన చేశారన్నారు. సిద్దిపేటలో గద్దర్ అన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సభ పెడతామని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచిన ఇంకా అసమానతలు పోలేదని.. సమాజంలో వివక్ష తొలగింపు కోసం గద్దర్ అన్న చేసిన పోరాట స్ఫూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని.. అమరవీరులకు నివాళులు అర్పించలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి, బతుకమ్మను తొలగించడంతోనే తెలంగాణ ప్రముఖ రచయిత, కవిత నందిని సిద్ధారెడ్డి ప్రభుత్వం అందించిన కోటి రూపాయలు నగదు బహుమతిని తిరస్కరించాడని అన్నారు.