తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన : హరీశ్​రావు

సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. గురువారం సిద్దిపేట క్యాంపు ఆఫీసులో ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. -తాము వరద సాయం చేయడానికి ఖమ్మం వెళ్తే దాడులు చేసి కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తమకు ప్రజల నుంచి  వస్తున్న స్పందన ను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేక పోయారని ఇండ్లు నీళ్లలో మునిగిపోయిన వారికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

వరద బాధితులకు సిద్దిపేట నుంచి ఉడుత భక్తిగా సాయం చేస్తున్నామని మానవ సేవయే మాధవ సేవగా భావించి  వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనాన్ని  వరద బాధితులకు అందిస్తున్నామని ప్రకటించారు. బీజేపీతో పాటు  మిగతా పార్టీల నాయకులు సాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. అనంతరం వసతి గృహాల సలహా సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ స్థాయి  ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల అనుబంధ హాస్థల్స్ సమస్యలు తెలుసుకున్నారు.  దాదాపు 6 నెలల నుంచి డైట్, కాస్మోటిక్ ఛార్జ్ లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 7 నెలలు గా జీతాలు చెల్లించక పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విపంచి కళా నిలయంలో 500 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

సమాజంలో టీచర్లది ప్రత్యేక స్థానం 

సిద్దిపేటటౌన్:సమాజంలో టీచర్లది ప్రత్యేక స్థానమని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవనంలో గురుపూజోత్సవ సందర్భంగా జిల్లా ఉత్తమ టీచర్లను  సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉందని , సమష్టి కృషి వల్లనే ఐదేళ్ల నుంచి అద్భుత ఫలితాలు సాధిస్తుందన్నారు. రూ.9 వేల కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమానికి కేసీఆర్​శ్రీకారం చుట్టారని కానీ క్రాంగ్రెస్​ప్రభుత్వం ఆపివేయడం వల్ల1700 స్కూల్స్​ముతపడ్డాయని ఆరోపించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, రామస్వామి, భాస్కర్, రంగనాధ్, ముక్తేశ్వరి, నాయకులు మంజుల, సాయిరాం టీచర్లు పాల్గొన్నారు.