టీడీపీ చెప్పు చేతల్లో పోలీస్ వ్యవస్థ పని చేస్తోంది: అంబటి రాంబాబు

ఏపీ పోలీస్ వ్యవస్థపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు. పోలీస్ వ్యవస్థ టీడీపీ చెప్పు చేతల్లో పని చేస్తోందని అన్నారు అంబటి రాంబాబు. వైసీపీ నాయకులపై టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి.. మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జగన్ సహా  వైసీపీ నేతల కుటుంబాలపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు అంబటి.

ఈ విషయంపై అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశామని..తమ ఫిర్యాదులపై ఇప్పటి వరకు కేసులు కూడా పెట్టలేదని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇప్పటికి 100కు పైగా కేసులు పెట్టారని.. వైసీపీ నేతలపై టీడీపీ ట్విట్టర్లో సైతం దుర్భాషలాడుతున్నారని పేర్కొంటూ తాము 10 ఫిర్యాదులు చేస్తే... ఇప్పటిదాకా ఒక్క కేసు నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి. పోలీస్ వ్యవస్థ ఇలాగే వ్యవహరిస్తే.. తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు అంబటి.

ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవడం పొలిసుల బాధ్యత అని..  మాజీ మంత్రుల ఫిర్యాదులు కూడా పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు అంబటి. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.